ఓటర్ జాబితా గోల్‌మాల్.. గ్రామస్తుల ఆందోళన

by Aamani |
ఓటర్ జాబితా గోల్‌మాల్.. గ్రామస్తుల ఆందోళన
X

దిశ, అలంపూర్: రాజకీయ నాయకుల అండదండలతో ఓటర్ జాబితానే తారుమారు చేసి గ్రామస్తుల మధ్య చిచ్చుపెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని బోరవెల్లి గ్రామపంచాయతీలో చోటుచేసుకుంది. గత నాలుగు నెలలుగా తిరుగు ఓటర్ జాబితా సవరించాలని ఎన్నోమార్లు అధికారులకు విన్నవించుకున్న, దరఖాస్తులు ఇచ్చిన పెడచెవిన పెట్టడంతో బుధవారం గ్రామంలో జరుగుతున్న ఉపాధి గ్రామ సభను గ్రామస్తులు అడ్డుకున్నారు. ముందుగా ఓటర్ జాబితాను సవరించాలని లేనిపక్షంలో ఉపాధి గ్రామసభ వద్దని అడ్డుకున్నారు. ఓటర్ జాబితాలో ఒకటవ వార్డు నుండి 12వ వార్డు వరకు ఇష్టం వచ్చినట్లు అక్కడి ఓట్లని ఇక్కడికి, ఇక్కడి ఓట్లను అక్కడికి తారుమారు చేసి పంచాయతీ కార్యదర్శి రాజకీయ చేస్తుందని, ఎంపీడీవో కూడా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు అగ్రహం వ్యక్తం చేశారు.

ఓటర్ జాబితా తరుమారు కావడంతో గ్రామంలో కొట్టుకునే పరిస్థితి ఏర్పడిందని, ప్రశాంత వాతావరణంలో ఉన్న గ్రామాన్ని ఓటర్ జాబితా మార్పులు చేసి అందరి మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. అధికారులు స్పందించకపోతే రాబోయే ఎన్నికలను అడ్డుకుంటామని, న్యాయం చేసే వరకు పోరాడుతామని హెచ్చరించారు. ఉపాధి గ్రామ సభను అడ్డుకోవడంతో జరిగేది ఏమీ లేదని, మాకు కొంత సమయం ఇస్తే ఓటర్ జాబితాను మళ్ళీ మార్పు చేసి యధావిధిగా కొత్త జాబితాను అందిస్తామని ఎంపీడీవో నచ్చదు చెప్పడంతో గ్రామస్తులు శాంతించారు. గురువారం ఉదయం గ్రామంలో మరొకసారి తిరిగి డప్పు వేయించి నోటీసులు జారీ చేస్తామని, గతంలో ఎలా జాబితా ఉందో అలాగే ఉండే విధంగా తెలిపారు.

బోరవెల్లి గ్రామంలో సుమారు 2600 మంది ఓటర్లు ఉన్నారు. కానీ ఏ ఎన్నికలు జరిగిన ఒకటవ వార్డు నుండి ఆరో వార్డు వరకు వన్ సైడ్ ఎన్నికలు జరగుతాయి. కానీ ఇలా జరగకూడదని కొందరు రాజకీయ స్వార్థం తో ఓటర్ జాబితాను గల్లంతు చేసి, ఒక్కొక్క వాటి నుండి 20 నుండి 30 మంది దాకా మార్పులు చేసి జాబితాను తారుమారు చేశారని గ్రామస్తులు అంటున్నారు. ఏది ఏమైనా ఓటర్ జాబితా మార్పులు చేసి 2018లో ఉన్నట్లుగానే జాబితా ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తామని, దీని వెనుక ఎవరు ఉన్న బయటకు లాగుతామని మండిపడ్డారు. లేదంటే రాబోయే పంచాయతీ ఎన్నికలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed