రెండో రోజు అదే తీరు.. మాగనూరు హైస్కూల్‌లో మళ్లీ పురుగుల అన్నమే..

by Naveena |   ( Updated:2024-11-21 12:03:15.0  )
రెండో రోజు అదే తీరు.. మాగనూరు హైస్కూల్‌లో మళ్లీ పురుగుల అన్నమే..
X

దిశ, మక్తల్/ మాగనూరు: ఫుడ్ పాయిజనై వంద మంది విద్యార్థులు ఆస్పత్రి పాలైనా మండల విద్యాశాఖ అధికారులు తీరుమారలేదు. రెండోరోజు కూడా పురుగుల అన్నమే విద్యార్థులకు వండివడ్డించారు. అదే సమయంలో పాఠశాలకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి విద్యార్థులు తినే ఆహారాన్ని చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాగనూరు హైస్కూల్ ఉపాధ్యాయుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. వెంటనే తనే సొంత డబ్బులతో బియ్యం తెప్పించే విద్యార్థులకు వండి వడ్డించారు.

బుధవారం మక్తల్ నియోజకవర్గం మాగనూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం కలుషితమై వంద మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురై ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం పాఠశాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాఠశాలలో విద్యార్థుల కోసం వండిన అన్నం, కూరలను పరిశీలించారు. ఉడికీ ఉడకని అన్నంలో తెల్లటి పురుగులు కనిపించాయి. దీంతో మిడ్డె మిల్స్ కోసం స్టాక్ పాయింట్ నుంచి స్కూల్‌కు సప్లై చేసిన బియ్యం బస్తాలను పరిశీలించగా.. ముక్కిన బియ్యం ఉండలు కట్టి ఉండి ఏమాత్రం వండడానికి పనికి రాకుండా ఉన్నాయి. దీంతో ఆయన అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంట్లో పిల్లలకు ఇలాంటి బియ్యంతోనే భోజనం వండి పెడతారా అంటూ ప్రశ్నించారు.

ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు మాజీ ఎమ్మెల్యే చిట్టం ఎదుట కంటతడి పెట్టుకున్నారు. పురుగుల అన్నం తాము తినలేమని భోరున విలపించారు. దీంతో కలత చెందిన ఆయన సొంత డబ్బులిచ్చి కిరాణం షాపు నుంచి బియ్యం తెప్పించారు. వంటవారితో భోజనం తయారు చేయించి విద్యార్థులకు అందించారు. వీరితోపాటు అధికారులు, రాజకీయ నాయకులు భోజనాన్ని తిన్నారు. అనంతరం పాఠశాలలో ఉన్న ముక్కిన బియ్యాన్ని సివిల్ సప్లై గోదాంకు పంపించి.. మంచి బియ్యాన్ని రేపటిలోపు అందించాలని ఆర్డీవో, జిల్లా సివిల్ సప్లై అధికారిని కోరారు.

Advertisement

Next Story