మా సమస్యలను పరిష్కరించాలి.. మీడియా అకాడమీ చైర్మన్‌కు మహిళా జర్నలిస్టుల వినతి

by Shiva |
మా సమస్యలను పరిష్కరించాలి.. మీడియా అకాడమీ చైర్మన్‌కు మహిళా జర్నలిస్టుల వినతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) మహిళా సంక్షేమ కమిటీ మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. గురువారం బీఆర్‌కేఆర్ భవన్‌లో శ్రీనివాస్‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ప్రతి మీడియా సంస్థలో మహిళలకు 33 శాతం అక్రెడిషన్లు ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ పలు మీడియా సంస్థలు దానిని అమలు చేయడం లేదన్నారు. ప్రతి మీడియా సంస్థలో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ అమలు కావడం లేదని వారు విచారం వ్యక్తం చేశారు.

విశాఖ గైడ్‌లైన్స్ ప్రకారం ప్రతి మీడియా సంస్థలోనూ జెండర్ సెన్సిటివిటీ వర్క్‌షాప్స్ జరగాలనే నిబంధన కాగితాలకే పరిమితమైందని అన్నారు. ఇప్పటి నుంచి అయినా విశాఖ గైడ్‌లైన్స్ ప్రతిచోటా అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. ఐసీసీ గైడ్‌లైన్స్ పాటించని సంస్థలకు అక్రిడేషన్లు ఇవ్వరాదనే నిబంధన తీసుకురావాలన్నారు. ఐసీసీలో ఇచ్చే ప్రతి కంప్లైంట్‌ను మీడియా అకాడమీ దృష్టికి తీసుకువచ్చేలా కంప్లైంట్ బాక్స్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. అక్రెడిషన్లతో సంబంధం లేకుండా మహిళా జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్నారు. మీడియా సంస్థల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగుల జాబితాను ప్రతి మీడియా సంస్థ కచ్చితంగా ఆరు నెలలకోసారి మీడియా అకాడమీకి సమర్పించేలా చర్యలు చేపట్టాలన్నారు.

పూర్తి స్థాయి మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంపును 6 నెలలకు ఒకసారి నిర్వహించేలా చర్యలు చేపట్టాలని విన్నవించారు. మీడియా సంస్థల్లో పని చేసే మహిళ ఉద్యోగులకు రాత్రివేళల్లో తప్పనిసరిగా రవాణా సౌకర్యం కల్పించాలని అన్నారు. విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు, ఇబ్బందులు, మహిళా జర్నలిస్టుల భద్రత, ఇతర సమస్యల పరిష్కారానికి మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతినిధి బృందం కోరింది. ఈ మహిళ జర్నలిస్టుల ప్రతినిధుల బృందంలో టీయూడబ్ల్యూజే మహిళా సంక్షేమ కమిటీ బాధ్యులు కళ్యాణం రాజేశ్వరీ, అత్తలూరి అరుణ, అజితా, వంగ యశోద, సూర్యకుమారి, ప్రతిభ, సాజిదా బేగం ఉన్నారు.

Advertisement

Next Story