ఆర్టీసీ ఆదాయంలో ఈ జిల్లానే నెంబర్ వన్

by Naveena |
ఆర్టీసీ ఆదాయంలో ఈ జిల్లానే  నెంబర్ వన్
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ కి ఆదాయం సమకూర్చడంలో రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నెంబర్ వన్ గా నిలిచిందని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వి.శ్రీదేవి తెలిపారు. శుక్రవారం స్థానిక బస్ స్టాండ్ ఆవరణలోని ఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పక్షం రోజుల్లోనే 39 కోట్ల 22 లక్షల ఆదాయం సమకూర్చి ఆల్ టైం రికార్డు నెలకొల్పామని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. మొత్తం 740 ప్రత్యేక బస్సులతో,52 లక్షల 73 వేల కిలోమీటర్లను తిప్పి, 69 లక్షల 83 వేల మంది ప్రయాణికుల్ని వారి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేశమన్నారు. అలాగే 110.14 ఓఆర్ తో, 39 కోట్ల 22 లక్షల రూపాయల ఆదాయాన్ని సమకూర్చామని,ఇది కేవలం దసరా పండుగ పక్షం రోజుల ఆదాయమని ఆమె తెలిపారు. కేవలం 14 వ తేది ఒక్కరోజులో 138 ఓఆర్ సాధించి,4.97 లక్షల మంది ప్రయాణించగా..3 కోట్ల 33 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని ఆమె వివరించారు. ఇది ఉమ్మడి జిల్లా ఆర్టీసీ సిబ్బంది సమిష్టి కృషి ఫలితమన్నారు. ప్రయాణికులు తమపై ఉంచిన విశ్వాసం తోనే ఇది సాధ్యమైందని,ఇందుకు కృషి చేసిన ఆర్టీసీ సిబ్బందికి,ప్రయాణించిన ప్రయాణికులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో డిఫ్యూటీ ఆర్ఎం లు లక్ష్మి ధర్మ,శ్యామల,మహబూబ్ నగర్ డిపో మేనేజర్ సుజాత లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed