పంచాయతీలో రికార్డుల ట్యాంపరింగ్? ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఉన్నతాధికారులు

by Shiva |
పంచాయతీలో రికార్డుల ట్యాంపరింగ్? ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఉన్నతాధికారులు
X

దిశ, జడ్చర్ల: జడ్చర్ల మండలం పోలేపల్లి పంచాయతీలో రికార్డులు టాంపరింగ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోనే అత్యంత కీలకమైన పోలేపల్లి పంచాయతీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి సంబంధిత గ్రామ పంచాయతీ పాత సెక్రటరీ ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొత్త సెక్రటరీ బాధ్యతలు చేపట్టి రెండు నెలలు గడుస్తున్నా.. రికార్డులు అప్పగించకుండా తాత్సారం చేయడంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పోలేపల్లి పంచాయతీ సెక్రటరీగా శివప్రసాద్ దాదాపు నాలుగున్నరేళ్ల పాటు పని చేశారు.

ఆయన సెక్రటరీగా కొనసాగిన కాలంలో పంచాయతీలో రూ.కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటిలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే శివప్రసాద్‌ను పోలేపల్లి నుంచి బదిలీ చేసి ఆయన స్థానంలో లక్ష్మీనారాయణ‌ను సెక్రటరీగా నియమించారు. లక్ష్మీనారాయణ గత జూలైలో 20వ తేదీన బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త సెక్రటరీ బాధ్యతలు చేపట్టిన వెంటనే పాత సెక్రటరీ పంచాయతీకి సంబంధించిన రికార్డులను కొత్త సెక్రటరీకి అప్పగించాలి.

అయితే, లక్ష్మీనారాయణ బాధ్యతలు చేపట్టి రెండు నెలలైనా.. శివప్రసాద్ ఇప్పటి వరకు ఆయనకు రికార్డులు అప్పగించలేదు. దీనిపై లక్ష్మీనారాయణ డీపీవోకు ఫిర్యాదు చేసినా రికార్డుల అప్పగింతకు ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. కాగా, గత నాలుగున్నర ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పోలేపల్లి పంచాయతీలోలో రూ.6 కోట్ల దాకా ఆర్థిక లావాదేవీలు జరగగా.. అందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని పాత సెక్రటరీ శివప్రసాద్ రికార్డులను టాంపరింగ్ చేస్తుండవచ్చని, అందుల్లే రికార్డులను అప్పగించడంలో తాత్సారం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తా: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

పోలేపల్లి పంచాయతీ రికార్డులను సెక్రటరీ లక్ష్మీనారాయణకు అప్పగించడంలో పాత సెక్రటరీ శివప్రసాద్ తాత్సారం చేస్తున్న విషయం తన దృష్టికి కూడా వచ్చింది. దీనిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోకు ఆదేశించాను. ఒకవేళ ఎంపీడీవో స్పందించకుంటే ఆయనపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తా. అవసరమైతే విజిలెన్స్ అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తా.

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశా :విజయ్ కుమార్, ఎంపీడీవో, జడ్చర్ల

పాత సెక్రెటరీ శివప్రసాద్‌పై చర్యలు తీసుకోవడంలో తాను ఎలాంటి నిర్లక్ష్యం చూపలేదు. రికార్డులు అప్పగించడం లేదని తెలిసిన వెంటనే పాత సెక్రటరీ శివప్రసాద్ జీతం నిలిపివేశాను. శివప్రసాద్ వ్యవహారంపై జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి కూడా తీసుకెళ్లాను. ఆయన కూడా పంచాయతీని సందర్శించి వివరాలు సేకరించారు. తదుపరి చర్యలు తీసుకోవాల్సిన అధికారం తనకు లేదు. ఆ అధికారం డీపీవో, జిల్లా కలెక్టర్‌కు మాత్రమే ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed