సంచలనం.. అర్ధరాత్రి 78 ఇండ్ల కూల్చివేత..

by Nagam Mallesh |
సంచలనం.. అర్ధరాత్రి 78 ఇండ్ల కూల్చివేత..
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : హైదరాబాద్ లో హైడ్రా అక్రమ నిర్మాణాలను కూలుస్తుంటే వావ్ అనుకున్నారు. ఇప్పుడు అదే కూల్చివేతలు జిల్లాకు కూడా చేరాయి. అర్ధరాత్రి 2 గంటలకు పక్కా ప్లానింగ్ తో అధికారులు బుల్డోజర్లను దించారు. ఒక్కొక్కటిగా ఇండ్లను కూల్చేస్తూ నేలమట్టం చేసేశారు. తెల్లారే సరికి ఇండ్లన్నీ నేలకొరిగాయి. జిల్లా కేంద్రంలోని 523 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్నారని మహబూబ్ నగర్ అర్భన్ తహశీల్దార్ సిబ్బంది, పోలీస్, మున్సిపల్ అధికారులు బుధవారం అర్థరాత్రి 2 నుండి గురువారం ఉదయం 5 గంటల వరకు దాదాపు 78 ఇండ్లను నేల మట్టం చేశారు. కొన్ని ఇండ్లు నిర్మాణం పూర్తి అయినవి, మరికొన్ని నిర్మాణంలో ఉన్న ఇండ్లను ప్రొక్లేన్ లతో కూల్చివేశారు. ఈ సర్వే నెంబర్ లో దాదాపు 83 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కొంత మంది లబ్దిదారులకు ఇండ్లు కట్టుకోవడానికి స్థలాలకు పట్టాలను ఇచ్చారని.. అనంతరం తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పట్టాలను తిరిగి తీసుకొని కొంతమందికి పట్టాలివ్వగా.. మరికొంత మంది స్థలాలను అక్రమంగా ఆక్రమించుకున్నట్లు మరికొన్నింటిని ప్రజాప్రతినిధులు దొంగ పట్టాలను సృష్టించి అమ్ముకొన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇండ్లు కోల్పోయిన దివ్వాంగ బాధితులు గురువారం కూలగొట్టిన ఇండ్లు వద్ద ఆందోళన చేపట్టారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన స్ధలంలోనే ఇండ్లు కట్టకున్నామని, మా దగ్గర ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు కూడా ఉన్నవని, అయినా అధికారులు ఎలాంటి నోటీసులు కాని, సమాచారం లేకుండా నేల మట్టం చేశారని బాధితులు ఏకరువు పెట్టుకున్నారు. ఏది ఏమైనా హైదరాబాద్ లో హైడ్రా పేర మొదలైన అక్రమకట్టడాల కూల్చివేత మహబూబ్ నగర్ కు పాకిందని పలువురు వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed