నాడు పచ్చదనం.. నేడు కాలుష్యం

by Nagam Mallesh |
నాడు పచ్చదనం.. నేడు కాలుష్యం
X

దిశ, బాలానగర్ : బాలానగర్ మండలం.. పదేళ్ల క్రితం గుట్టలతో పచ్చదనంతో.. ప్రకృతి పరవశించే విధంగా ఉండేది. అప్పట్లో మండలంలోని వివిధ గ్రామాలలో.. వ్యవసాయ భూముల్లో, గుట్టలలో సీతాఫలం చెట్లు విపరీతంగా ఉండేవి. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో సమృద్ధిగా దొరికే సీతాఫలాల కోసం చుట్టుపక్కల మండలాల ప్రజలు, మరియు కల్వకుర్తి, దేవరకొండ, నాగర్ కర్నూల్, కొల్లాపూర్ తదితర ప్రాంతాల నుండి చిరు వ్యాపారులు వచ్చి.. ఈ ప్రాంతంలో ఉదయం పూట పొలాలలో..గుట్టల్లో సైకిల్ లపై తిరుగుతూ.. సీతాఫలాలు సేకరించేవారు. వాటిని ఓ వాహనంలో హైదరాబాద్ తీసుకెళ్లి మార్కెట్లో అమ్ముకునేవారు. దీంతో చిరు వ్యాపాలస్తులు డబ్బు సంపాదించేవారు. వారికి ఉపాధి కూడా దొరికేది. గత కొన్నేళ్లుగా.. బాలానగర్ రంగారెడ్డి జిల్లాకు సమీపాన ఉండడంతో మండలంలో వివిధ గ్రామాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సమృద్ధిగా వ్యాపారం సాగుతుంది. ఇతర ప్రాంతాల నుంచి నుంచి వచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యవసాయ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి వెంచర్ గా మారుస్తున్నారు. వ్యవసాయ భూముల్లో ఉన్న చెట్లను తొలగించి ప్రకృతిని నాశనం చేస్తున్నారు. భూమిని..వెంచర్ గా మార్చిన అనంతరం.. గజం రూ.12 వేల నుండి రూ.18 వేల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వ్యవసాయ భూములను వెంచరుగా మార్చడానికి గుట్టల్లో ఉన్న మట్టిని.. రాత్రి వేళలో మట్టిమాఫియాతో చేతులు కలిపి.. అధికారుల అండదండతో.. ప్రభుత్వ సెలవు దినాలలో.. రాత్రిపూట గుట్టల్లో నుండ టిప్పర్ల ద్వారా మట్టిని వెంచర్లకు విక్రయిస్తున్నారు. దీంతో నిండు పచ్చదనంతో ఉన్న గుట్టలు.. నేడు ప్రకృతి అందాన్ని కోల్పోయి ఎడారిని తలపిస్తున్నాయి. మండల కేంద్రానికి అతి సమీపంలో.. క్రషర్ మిషన్ తో వచ్చే దుమ్ము, దూళితో పెద్దాయపల్లి సమీపంలో ఉన్న ఓ కంపెనీ నుండి వెలువడే పొగతో గౌతాపూర్, బుడజానంపేట ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం లేచి చూడగా.. పరిసరాలు దుమ్ము ధూళితో అందవిహీకనంగా కనిపిస్తున్నాయని ప్రజలు అన్నారు. ఇటీవలే మండలంలోని పెద్దాయపల్లి గ్రామ శివారులో రాత్రిపూట జెసిబి సహాయంతో మట్టిని.. తరలించారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పలు సంఘటనలు బాలానగర్ మండల కేంద్రంలో చాలా వరకు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో.. పర్యావరణాన్ని నాశనం చేయకూడదని, మానవ మనుగడకు ప్రకృతి అవసరమని.. అధికారులు రియల్ ఎస్టేట్ సంస్థల వ్యాపారస్తులతో చేతులు కలపకుండా.. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని మండల ప్రజలు కోరారు.

Advertisement

Next Story