ఎకరాకు రూ. 30 వేలు పంట నష్ట పరిహారం చెల్లించాలి

by Kalyani |
ఎకరాకు రూ. 30 వేలు పంట నష్ట పరిహారం చెల్లించాలి
X

దిశ, జడ్చర్ల: అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎకరాకు రూ. 30 వేలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బీజేపీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి డిమాండ్ చేశారు. గురువారం జడ్చర్ల మండల పరిధిలోని చర్లపల్లి గ్రామంలో అకాల వర్షానికి పంట దెబ్బతిని నష్టపోయిన మొక్కజొన్న పంటలను బీజేపీ నాయకురాలు బాల త్రిపుర సుందరితో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా వీరబ్రహ్మచారి మాట్లాడుతూ.. చర్లపల్లి గ్రామంలో సుమారుగా 50 ఎకరాలకు పైగా మొక్కజొన్న పంట దెబ్బతిన్నదని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో పంటల దెబ్బతిని రైతులు అపారంగా నష్టపోయారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎకరాకి రూ. 30 వేలు నష్ట పరిహారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేసి ఉంటే రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేవారని, వారి స్వార్థ రాజకీయాల కోసం కేంద్ర ప్రభుత్వ పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని చెప్పారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకమైన ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని లేని పక్షంలో రైతుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మధు గౌడ్, నగర ప్రధాన కార్యదర్శి వెంకట్, ఎస్సీ మోర్చా నగర అధ్యక్షుడు జగదీష్, నాయకులు మురళీకృష్ణ, బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు నరసింహులు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు సీనియర్ నాయకులు శేఖర్, కిసాన్ మోర్చా జిల్లా కోశాధికారి బాలస్వామి, అరుణ్, బుక్క నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed