పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు జీఓ తెచ్చింది నేనే

by Sridhar Babu |
పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు జీఓ తెచ్చింది నేనే
X

దిశ, జడ్చర్ల : పాలమూరు ప్రాజెక్టు కోసం జీఓ తీసుకొచ్చింది తానేనని, 8 ఏళ్లు గడుస్తున్నా ఉదండాపూర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పూర్తిస్థాయి న్యాయం జరగలేదని, వారికి న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎంపీ డీకే అరుణ అన్నారు. మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం సిగ్నల్ గడ్డ ప్రాంతంలోని 167వ జాతీయ రహదారి రోడ్డు విస్తరణ పనులు జాప్యం కావడంతో ఆమె స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ 167వ జాతీయ రహదారి రోడ్డు విస్తరణ పనులు నాణ్యత లోపించిందని, కాంట్రాక్టర్లు కూడా నిర్లక్ష్యం వహిస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని, మరోవైపు రైల్వే అండర్ బ్రిడ్జి పనులు కూడా నెమ్మదిగా జరుగుతుండడంతో మరింత ఇబ్బందికర పరిస్థితి నెలకొందని అన్నారు.

త్వరలోనే సంబంధిత అధికారులను సంప్రదించి పనులు వేగవంతం అయ్యేలా చూస్తామన్నారు. ఉదాండాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టును మంత్రులు పరిశీలిస్తుండగా భూ నిర్వాసితులు వారిని కలిసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకొని బెదిరించడం సరైంది కాదన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్​ రెడ్డి చెప్పిన విధంగానే రూ. 25 లక్షల ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో జీఓ తీసుకువచ్చింది తానే అని ఆమె అన్నారు. భూ నిర్వాసితులకు వెంటనే ప్రభుత్వం న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఎంపీ వెంట నియోజకవర్గం బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story