దారుణం.. ఇంటి ముందే బాలిక గొంతు కోసిన దుర్మార్గుడు

by Nagam Mallesh |
దారుణం.. ఇంటి ముందే బాలిక గొంతు కోసిన దుర్మార్గుడు
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : అభం, శుభం తెలియని చిన్నారులపై దాడులు ఆగట్లేదు. ఎన్ని చట్టాలు తెచ్చినా.. ఎన్ని శిక్షలు విధించినా.. చిన్నారులపై దుర్మార్గుల అఘాయిత్యాలు, అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇలాంటి దారుణమే జరిగింది. చెవి పోగులు బాగున్నాయి.. నాకివ్వాలంటూ బాలిక వెంటపడ్డ దుర్మార్గుడు.. చివరకు ఆమె గొంతు కోసి పారిపోయాడు. ఈ దారుణమైన ఘటన మహబూబ్ నగర్ పట్టణంలోని స్థానిక శ్రీనివాసకాలనీలో బుధవారం సాయంత్రం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమ్మాయి తల్లి సునీత తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస కాలనీలో నివాసముంటున్న నారాయణ, సునీత దంపతులకు 11 ఏళ్ళ సిరి అనే కుమార్తె ఉంది.

సిరి అదే కాలనీలోని ఒక ప్రైవేటు స్కూల్ లో 6వ తరగతి చదువుకుంటుంది. బుధవారం సాయంత్రం స్కూల్ అయిపోయాక దగ్గరలోని రూరల్ పోలీస్ స్టేషన్ కు ఆనుకొని ఉన్న పార్కులో ఆడుకోవడానికి వెళ్లింది. స్నేహితులతో ఆడుకుంటుండగా.. ఓ అగంతకుడు ఆమె దగ్గరకు వచ్చి 'నీ చెవి దుద్దులు బాగున్నాయి, నాకు ఇస్తావా, నా దగ్గర కూడా కమ్మలు ఉన్నాయి.. అవి నీకు ఇస్తాను అని' ఏవేవో మాయ మాటలు చెప్పాడు. కానీ ఆ బాలిక మాత్రం నమ్మకుండా కోపంగా వ్యతిరేకించి అతనికి దూరంగా వెళ్ళి స్నేహితులతో ఆడుకుంది. కొంత సమయం గడిచాక తల్లి సునీత వచ్చి కుమార్తెను తీసుకొని ఇంటికి బయలుదేరింది. మధ్యలో మరో చిన్న పార్కు ఉండగా.. అక్కడ తాను కాసేపు ఆడుకొని ఇంటికి వస్తానని సిరి చెప్పడంతో అక్కడ వదిలి ఇంటికి వెళ్ళిపోయింది సునీత. అయితే ఆ అగంతకుడు మాత్రం చిన్నారిని వారికి తెలియకుండా వెంబడిస్తూనే ఉన్నాడు. పార్కులో కొద్దిసేపు ఆడుకున్నాక ఇంటికి బయలుదేరింది బాలిక. ఆమె సరిగ్గా తన ఇంటి గేటు వద్దకు రాగానే.. ఆ ఆగంతకుడు అనుసరించి బాలికను బ్లేడుతో గొంతు కోసి పరారయ్యాడు. ఆ బాలిక ఆర్తనాదాలతో ఇంట్లోకి వెళ్లి తల్లికి ఏడుస్తూ చెప్పడంతో.. వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఎస్వీఎస్ ఆసుపత్రికి తీసుకెళ్ళింది. అయితే చిన్నారిని కేవలం కమ్మల కోసమే చంపబోయాడా.. లేదా ఇంకేదైనా విషయం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటన తెలుసుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు, రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ గాంధీ నాయక్ ఆసుపత్రికి వెళ్ళి వివరాలను సేకరించారు. దర్యాప్తు ప్రారంభించి దుండగుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story