- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పట్టు కోసం పోరు.. రసవత్తరంగా కొల్లాపూర్ రాజకీయాలు
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: కొల్లాపూర్ రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును బీఆర్ఎస్ అధిష్టానం సస్పెండ్ చేయడంతో అందరి దృష్టి కొల్లాపూర్ పై పడింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పట్టు నిలుపుకునేందుకు ఒకవైపు బీఆర్ఎస్ నేతలు, మరోవైపు మాజీ మంత్రి జూపల్లి వర్గం వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. మంగళవారం చిన్నంబావిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తూ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిని ఆహ్వానించడం.. మరోవైపు కొల్లాపూర్‌లో జూపల్లి వర్గం సైతం సమావేశం నిర్వహిస్తుండడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
జూపల్లి కృష్ణారావును సోమవారం పార్టీ నుంచి బహిష్కరిస్తూ అధిష్టానం ఆదేశాలు జారీ చేయడం... ఆ వెంటనే జూపల్లి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసి... తనకు విముక్తి కలిగినట్లుగా మీడియా ముందు ప్రకటించడం ఉమ్మడి పాలమూరు జిల్లాలో చర్చలకు దారితీసింది. జూపల్లిని పార్టీ నుంచి బహిష్కరించే క్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి జూపల్లి పై విమర్శల వర్షం గుప్పించారు. అధికార పార్టీ నేతలు... బహిష్కృత నేత మధ్య మీడియా మాధ్యమంగా సాగిన మాటల యుద్ధాన్ని ప్రజలు ఆసక్తిగా గమనించారు. ఈ అంశాలపై రాజకీయంగా చర్చలు జరిపారు. ఈ క్రమంలో కొల్లాపూర్ రాజకీయాలను మరింత వేడెక్కించేలా అధికార పార్టీ నేతలు ఒకవైపు, జూపల్లి వర్గం మరోవైపు పోటాపోటీగా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారు.
రంగంలోకి మంత్రి, ఎమ్మెల్సీ ..
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డికి కొంత పట్టు ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన హర్షవర్ధన్ రెడ్డి గెలుపునకు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి అన్ని విధాల సహకారం అందించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడంలో మంత్రి నిరంజన్ రెడ్డి ప్రధాన భూమికను పోషించారని ప్రచారంలో ఉంది. ఈ కారణంగానే జూపల్లి, మంత్రి నిరంజన్ రెడ్డి మధ్య మొదటి నుంచి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ వస్తుంది. ఇప్పుడు జూపల్లి పార్టీకి దూరమైన నేపథ్యంలో కొల్లాపూర్ లో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి మద్దతుగా కార్యక్రమాలను నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి స్వీకరించారు.
ఈ క్రమంలో మంగళవారం మొదటి సమావేశాన్ని చిన్నంబావి మండల కేంద్రంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. జూపల్లి పార్టీని వీడిన నేపథ్యంలో ఆయన వెంబడి నాయకులు, కార్యకర్తలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు... జూపల్లి వర్గీయులను, ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలను బీఆర్ఎస్ లో కి చేర్చుకునే విధంగా పకడ్బందీ ప్రణాళికలను సిద్ధం చేసే పనిలో పడ్డారు. మరోవైపు జూపల్లి వర్గీయులు సైతం అధికార పార్టీ ఆత్మీయ సభకు దీటుగా కొల్లాపూర్ లో ఆత్మీయ సమ్మేళన నిర్వహణకు ఆగమేఘాలపై సన్నద్ధం అయ్యారు.. దీంతో అధికార పార్టీ నేతలు, మాజీ మంత్రి జూపల్లి మధ్య సాగే ఆధిపత్య పోరు ఎన్నికల నాటికి ఏ పరిణామాలకు దారితీస్తుందో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలంతా ఇప్పుడు కొల్లాపూర్ నియోజకవర్గం వైపు దృష్టి సారిస్తున్నారు.