జడ్చర్ల ఐటీసీ గోడౌన్ లో భారీ చోరీ..

by Sumithra |
జడ్చర్ల ఐటీసీ గోడౌన్ లో భారీ చోరీ..
X

దిశ, జడ్చర్ల : జడ్చర్ల పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ గోడౌన్లో చోరీకి పాల్పడి సుమారు 50 లక్షల విలువైన సిగరెట్ కాటన్ లను ఎత్తుకెళ్లి పరారయ్యారు దుండగులు. పూర్తి వివరాల్లోకెళితే జడ్చర్ల మున్సిపాలిటీలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఐటీసీ గోడౌన్ లో ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు గోడౌన్ లోకి చొరబడ్డారు. సెటర్ లాకును విరగొట్టి గోడౌన్ లో ఉన్న డోర్ లాక్ ను కూడా పగులగొట్టి సుమారు 50 లక్షలు విలువైన సిగరెట్ కాటన్ లను ఎత్తుకెళ్లారు. ఓ ప్రత్యేక వాహనంలో సిగరెట్ కాటన్ లను లోడ్ చేసి అక్కడ నుంచి దుండగులు వాహనంతో పరారయ్యారు. ఆదివారం తెల్లవారుజామున పక్కనే ఉన్న మరో కిరాణం షాపు యజమాని గుర్తించి గోడౌన్ యజమాని మణికర్ కు సమాచారం అందించడంతో అక్కడికి వచ్చి చూసేసరికి తమ గోడౌన్లో సరుకు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీకి పాల్పడ్డ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు కావడంతో వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

గతంలో కూడా ఈ గోడౌన్ లో పలుమార్లు గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడడం, తాజాగా మరో మారు చోరీ చోటు చేసుకోవడంతో ఈ సంఘటన చర్చనీయాశంగా మారింది. కాగా గత రాత్రి సుమారు 60 లక్షలకు పైగా విలువగల సిగరెట్ కాటన్ లను దిగుమతి చేసుకున్నామని, తెల్లారేసరికి గోడౌన్ షట్టర్ తాళాలు పగలగొట్టడంతో పాటు గోడౌన్ లోని క్యాబిన్ తాళాలు కూడా విరగ్గొట్టి సుమారు 50 లక్షల విలువగల సిగరెట్ కాటన్ లను ఎత్తుకెళ్లారని గోడౌన్ యజమాని మణికర్ తెలిపారు. ఇది ఎవరైనా తెలిసిన వారి పనే అయి ఉంటుందని, కచ్చితంగా గోడౌన్ లో లక్షల విలువగల సామాగ్రి ఉందని తెలిసి ఈ పని చేసి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా చోరీ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో దుండగులు ఎవరనేది తొందర్లోనే తెలిసే అవకాశం ఉందని, ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జడ్చర్ల పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story