కులమత రాజకీయాలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తే సహించేది లేదు : ఎమ్మెల్యే

by Kalyani |
కులమత రాజకీయాలు  చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తే సహించేది లేదు :  ఎమ్మెల్యే
X

దిశ, జడ్చర్ల : దేవుడి పేరుతో మత రాజకీయాలు చేస్తూ సమస్యను మరింత జటిలం చేసి లేని సమస్యలను సృష్టించి పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం తగదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. జడ్చర్ల పట్టణంలోని పెద్దగుట్టపై గల రంగనాయక స్వామి దేవాలయం వద్ద మూసివేసిన కోనేరును సోమవారం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పరిశీలించారు. అక్కడ కోనేరు మూసివేత గల కారణాలను తెలుసుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ… పెద్దగుట్ట రంగనాథ స్వామి ఆలయ కోనేరు మూసివేసిన వ్యక్తి రవితేజ గౌడ్ పై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు చెప్పానని, రవితేజ గౌడ్ అనే వ్యక్తి గతంలో రౌడీషీటర్. అతనిపై కేసులు కూడా ఉన్నాయని ప్రస్తుత ఈ ఘటనలో అతనిపై కేసు నమోదు చేయడం జరిగిందని తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే అన్నారు.

ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలకు ఉపక్రమించిన కూడా పట్టణ బంద్​ కు పిలుపునివ్వడం ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు. కొందరు వ్యక్తులు రాజకీయ స్వలాభం కోసం ఈ ఘటనను బీఆర్ఎస్, బిజెపి పార్టీ నాయకులే రాద్ధాంతం చేస్తున్నారని సమస్యను పరిష్కరించిన కూడా మళ్లీ సమస్యను సృష్టించడం సమంజసం కాదని, కులమత రాజకీయాలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తే సహించేది లేదని అన్నారు. సమస్యను తప్పుదోవ పట్టించాలని చూస్తే నేనేంటో చూపిస్తానని తీవ్రంగా హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే ఈ ఘటనను పట్టించుకోవడంలేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ రాజకీయాలు చేస్తున్నారని, దేవుడిపై రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

జరిగిన ఘటన గురించి జరుగుతున్న పరిస్థితులకు తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. విషయాలు తెలుసుకోకుండా హిందూ ధార్మిక సంఘాలు బంద్ కు పిలుపునివ్వడం సరైనది కాదన్నారు. ఈ ఘటన పట్ల అన్ని విధాల విచారణ జరిపి నిందితులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. నేను కూడా హిందువునే హిందూమతం పైన గాని హిందూ దేవాలయాల పైన గానీ ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక సీఐకు ఆదేశించానని తెలిపారు.

మూసివేసిన కోనేరును పూర్వం ఉన్నట్లుగా యథావిధిగా కోనేరును ఏర్పాటుకు అధికారులు పనులు చేపడుతున్నారని అన్నారు. తొందర్లోనే ఎండోమెంట్ అధికారుల సమక్షంలో గ్రామ పెద్దలందరికీ చర్చించి అందరికీ యోగ్యమైన దేవాలయ నూతన కమిటీ ఏర్పాటు చేసి దేవాలయ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చి అన్ని విధాల అభివృద్ధి చేస్తానని, ఈ విషయాన్ని దేవుడి పేరుతో మత రాజకీయాలు చేసే వారి మాటలు విని ఎవరూ కూడా తొందర పాటు చర్యలకు పాల్పడొద్దని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కోరారు.

Advertisement

Next Story