కాంగ్రెస్ కు అధికారమిస్తే పరిశ్రమలను కర్ణాటకకు తరలిస్తారు : శ్రీనివాస్ గౌడ్

by Kalyani |   ( Updated:2023-11-04 15:21:19.0  )
కాంగ్రెస్ కు అధికారమిస్తే పరిశ్రమలను కర్ణాటకకు తరలిస్తారు : శ్రీనివాస్ గౌడ్
X

దిశ,మహబూబ్ నగర్; బీసీల పట్ల వివక్ష చూపుతున్న కాంగ్రెస్ పార్టీకి పొరపాటున అధికారం అప్పగిస్తే తెలంగాణ పరిశ్రమలన్నింటిని కర్ణాటకకు తరలించి రాష్ట్రాన్ని దివాలా తీయిస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన,కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన మైనార్టీ నాయకుడు సయ్యద్ ఇబ్రహీం,పి.చంద్రశేఖర్ లతో కలిసి మాట్లాడారు. హైదరాబాద్ లో నెలకొల్పనున్న ఐఫోన్ పరిశ్రమను తరలించుకు పోయేందుకు కర్ణాటక ప్రభుత్వం కుట్రపన్నుతుందని, దొంగ సర్వేలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తుందని ఆరోపించారు .పొరపాటున కూడా కాంగ్రెస్ పార్టీకి చిన్న అవకాశం ఇస్తే,రాష్ట్రంలో,నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోవడమే కాకుండా,అన్నీ అడ్డంగా అమ్మేస్తారని ఆయన విమర్శించారు.

బీసీలు,మైనార్టీల టిక్కెట్లను అమ్ముకుంటున్న కాంగ్రెస్ -సయ్యద్ ఇబ్రహీం

కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీలకు, మైనార్టీలకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ డబ్బులకు టికెట్లు అమ్ముకుని బడుగు బలహీన వర్గాలను తీవ్రంగా అన్యాయం చేశాయని మైనారిటీ నాయకుడు సయ్యద్ ఇబ్రహీం విమర్శించారు. పార్టీకి జీవితాంతం సేవ చేసిన వారిని కరివేపాకులా తీసిపారేసి, మతతత్వ పార్టీల నుంచి రాత్రికి రాత్రి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు. తన రాజకీయ జీవితం మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ ద్వారా మొదలైందని, తన ఊపిరి ఉన్నంతవరకు ఇక్కడి ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి భవిష్యత్తులోనూ ఉండాలంటే మరోసారి మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


బీజేపీలో డబ్బులుంటే 'హౌ ఆర్ యు' లేకుంటే 'హూ ఆర్ యు' -మాజీ మంత్రి పి చంద్రశేఖర్

జాతీయ పార్టీ అయిన బీజేపీ డబ్బులు ఉన్న వారిని 'హౌ ఆర్ యు' అని పలకరిస్తారని,అదే డబ్బులు లేకుంటే మాత్రం 'హూ ఆర్ యు' అంటారని మాజీ మంత్రి పి.చంద్రశేఖర్ ఆరోపించారు. సర్వేల ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్న అధిష్టానం,తీరా సీట్ల కేటాయింపులో మాత్రం వివక్ష ప్రదర్శించిందన్నారు .బీసీలను సీఎం చేస్తామన్న,బీసీ బీజేపీ అభ్యర్థులకు మాత్రం టికెట్లు కేటాయించలేదన్నారు. రాష్ట్రంలో చాలామంది బీజేపీ నాయకులు ఓడిపోతామనే భయంతో పోటీ చేయడం లేదని చంద్రశేఖర్ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.అంతకుముందు బీజేపీ నుంచి బీఆర్ఎస్ లోకి మారిన కార్యకర్తలకు గులాభి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

Next Story

Most Viewed