పాలమూరు ప్రాజెక్టులకు సంపూర్ణ సహకారం.. 23 వేల కోట్లు మంజూరు: మంత్రి హరీశ్ రావు

by Mahesh |
పాలమూరు ప్రాజెక్టులకు సంపూర్ణ సహకారం.. 23 వేల కోట్లు మంజూరు: మంత్రి హరీశ్ రావు
X

దిశ, అచ్చంపేట : పాలమూరు ప్రాజెక్టులకు సంపూర్ణ సహకారం అందిస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం అచ్చంపేట నియోజకవర్గం కేంద్రంలో రూ. 20 కోట్లతో నిర్మించిన వంద పడకల ఆస్పత్రి, 150 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ, నియోజకవర్గంలో రూ.14 కోట్లతో చేపట్టనున్న సీసీ, బీటీ రోడ్లు, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అధ్యక్షతన ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.

మంగళవారం అచ్చంపేట నియోజకవర్గంలో రెండు మంచి పనులు జరిగాయన్నారు. ఒకటి 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభం, రెండోది కృష్ణానది నీరు రావాలని ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేరిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అచ్చంపేట ప్రాంతానికి ఉమామహేశ్వర, చెన్నకేశవ మద్దిమడుగు ప్రాజెక్టులు మంజూరు చేసి రూ.23వేల కోట్లు మంజూరు చేసిందన్నారు.

కృష్ణానీటితో మారనున్న అచ్చంపేట రూపురేఖలు..

కృష్ణానది నీళ్ల అచ్చంపేటకు రానున్న నేపథ్యంలో ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారుతాయని, దశాబ్దాల కలను నిజం చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ అన్నారు. పాలమూరు జిల్లాలో ప్రతి ప్రాజెక్టుకు తన సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, నెట్టెంపాడు, దిండి అన్ని పథకాలు పూర్తయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రూపురేఖలతో మారిపోతాయన్నారు. త్వరలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభమవుతుందని, అదే క్రమంలో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభమవుతాయన్నారు.

కేసీఆర్‌తోనే జలదృశ్యం..

కేసీఆర్‌తోనే జలదృశ్యమని, విపక్షాలకు అప్పగిస్తే ఆత్మహత్యా సదృశం అవుతుందని విమర్శించారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమని, ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సీఎం అవుతారని, అదే వరుసలో అచ్చంపేట నుంచి బాలరాజును ప్రజలు మరోసారి ఆశీర్వదించాలన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎరువు బస్తాల కోసం లాఠీచార్జుల రోజులు మరిచిపోయామా గుర్తు చేశారు. రైతుబంధు కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండాలన్నారు.

తెలంగాణ రాకముందు..

2014 ముందు ఆ తర్వాత ఈ గ్రామాలకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో గ్రామాలు అభివృద్ధి పథంలో పరిగెడుతున్నాయని గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఐదు మెడికల్ కళాశాల మంజూరు చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ అన్నారు.

మంత్రి హరీశ్ రావు చేతిలో రాష్ట్ర ఖజానా తాళం..

సీఎం కేసీఆర్ ఆలోచనలతో ముందుకెళుతున్న మంత్రి హరీశ్ రావు చేతిలో ఈ రాష్ట్ర బీరువా తాళాలు ఉన్నాయని ఎంపీ రాములు అన్నారు. సీఎం కేసీఆర్ అచ్చంపేట ప్రాజెక్టు కోసం క్యాబినెట్ ఆమోదం తెలపడంతో ఈ ప్రాంత వాసుల కలలు నెరవేరుతున్నాయన్నారు.

మా మధ్యలో చిచ్చుపెట్టే ప్రయత్నం..

అచ్చంపేట అభివృద్ధికి ఎంపీ రాములు సహకారంతో అహర్నిశలు కృషి చేస్తుంటే కొందరు మా మధ్యలో చిచ్చుపెట్టే కుట్రలు చేస్తున్నారని, ఆ కుట్రలను పట్టించుకోమని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. ఈ ప్రాంతానికి నర్సింగ్, పాలిటెక్నిక్, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి ఆర్ అండ్ఆర్ ప్యాకేజీ రైతులకు మేలు జరిగేలా అందించాలని, అలాగే అచ్చంపేటకు పదివేల గృహలక్ష్మి ఇల్లు మంజూరు అయ్యేలా చేయాలని మంత్రిని కోరారు.

సమావేశంలో జెడ్పీ చైర్ పర్సన్ శాంతా కుమారి, రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయిచంద్, రాష్ట్ర వైద్య విధాన పరిషత్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జెడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ సింగ్, ఎంపీపీ శాంతాబాయి, అరుణ, జెడ్పీటీసీలు మంత్రి నాయక్, రాంబాబు నాయక్, ప్రతాప్ రెడ్డి, లక్ష్మమ్మ వెంకటరెడ్డి, భూపాల్ రావు, నగరం శీను, అంతటి శివ, చెన్నకేశవులు, రవీందర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed