మెగా కంపెనీ వల్లే మంచినీటి సమస్యలు

by Sridhar Babu |
మెగా కంపెనీ వల్లే మంచినీటి సమస్యలు
X

దిశ, మక్తల్ : మెగా కంపెనీ నిర్లక్ష్యం వల్లే నారాయణపేట, మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లోని ప్రజలు నీటి ఇబ్బంది పడుతున్నారని, తాగునీటి సమస్య పరిష్కారం కోసం సత్యసాయి నీటి సరఫరా పథకం ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు మక్తల్ ఎమ్మెల్యే వాకిట శ్రీహరి అన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సంగంబండ రిజర్వాయర్ వద్ద రూ. 430 కోట్లతో నాలుగు నియోజకవర్గాల ప్రజలకు తాగునీటిని సరఫరా చేసేందుకు ఫిల్టర్ బెడ్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు.

ఉమ్మడి జిల్లాలో తాగునీటి ఇబ్బందులపై అప్పట్లో దివంగత సత్యసాయి బాబా దృష్టికి తీసుకెళ్లగా స్పందించి శాశ్వత తాగునీటి పరిష్కారం కోసం కృషి చేయాలనే ఉద్దేశంతో 1999 సంవత్సరంలో సత్యసాయి నీటి సరఫరా ప్రాజెక్టుకు రూపకల్పన చేసి రూ.400 కోట్లతో ప్రారంభించినట్టు తెలిపారు. ఈ పథకంలో భాగంగా కృష్ణానది నుండి నీటిని తీసుకొని శుద్ధి చేసి సరఫరా చేసినట్టు తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2001 సంవత్సరంలో సుమారు 112 గ్రామాలకు సత్యసాయి నీటి సరఫరా పథకం ద్వారా తాగునీరు అందుతుండేదన్నారు. ఇందులో భాగంగా మక్తల్, జూరాల, జడ్చర్లను మూడు క్లస్టర్ గా విభజించి నీటి సరఫరా చేశారన్నారు. మక్తల్ క్లస్టర్​లో 86 గ్రామాలకు, జూరాల పరిధిలో 18 గ్రామాలకు, జడ్చర్ల పరిధిలో 8 గ్రామాలకు సత్యసాయి నీటి సరఫరా పథకం ద్వారా నీళ్లు అందేవన్నారు. 2001లో సత్యసాయి నీటి సరఫరా ప్రాజెక్టును ఆర్​డబ్ల్యూఎస్ కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించి అందుకుగాను కమిటీ వేసిందన్నారు. కానీ 2019లో దీనిని మిషన్ భగీరథలో విలీనం చేశారని గుర్తు చేశారు.

రోడ్డు మరమ్మతు కారణంగానే నీటి ఇబ్బందులు...

2019 నుంచి 2022 వరకు సత్యసాయి తాగునీటి పథకాన్ని మెగా కంపెనీ నిర్వహించిందని, 2023 నుంచి ప్రైవేట్ కంపెనీ కాంట్రాక్టర్ ఈ ప్రాజెక్టును కొనసాగిస్తున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు. సత్యసాయి నీటి సరఫరా పథకం కింద గతంలో శ్రీశైలం బ్యాక్ వాటర్ ను ఏలూరు నుండి 14 నియోజకవర్గాలు దాటి సుమారు 3400 గ్రామాలకు తాగునీటిని అందించారని, సుమారు 360 కిలోమీటర్ల ఈ పైప్లైన్ ఎక్కడ మరమ్మతుకు గురైనా తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. నేషనల్ హైవే అథారిటీ రోడ్డు విస్తరణలో భాగంగా మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మతులకు గురైందని గుర్తు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగిన సత్యసాయి తాగునీటి పథకం ప్రైవేటు కంపెనీకి అప్పగించడం కారణంగానే తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు.

ఆయా నియోజకవర్గాల్లో తాగునీటి శాశ్వత పరిష్కారం కోసం సంఘంబండ ప్రాజెక్టు రిజర్వాయర్ వద్ద రూ. 430 కోట్ల అంజనా వ్యయంతో తాగునీటి శుద్ధి ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే ఎగువ ఉన్న మక్తల్ నియోజకవర్గం నుంచి దిగువనున్న నారాయణపేట, దేవరకద్ర నియోజకవర్గాల పరిధిలో సులభంగా నీరు అందుతుందని తాను సీఎంకు చెప్పినట్టు వివరించారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి, చంద్రకాంత్ గౌడ్, కట్ట సురేష్ కుమార్ గుప్తా, బి.గణేష్, గొల్లపల్లి నారాయణ , ఆనంద్ గౌడ్, శీను, నాగేందర్ ,వల్లంపల్లి లక్ష్మణ్ , కావలి తాయప్ప, మహమ్మద్ నూరుద్దీన్, నరేందర్, అబ్దుల్ రెహమాన్, ఫయాజ్, నాగరాజ్, సాదిక్, వాకిటి శ్యామ్, అప్రోజ్, శివ, సురేష్, కల్లూరి గోవర్ధన్, నాగరాజ్, అశోక్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story