మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

by Aamani |
మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల( ఆనంద నిలయం), ఎస్సీ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా స్థానిక ఎస్సీ ఆనంద నిలయానికి వెళ్లిన కలెక్టర్ అక్కడ విద్యార్థినులకు వడ్డిస్తున్న అల్పాహారాన్ని పరిశీలించారు. వంట గదిలో నిల్వ ఉంచిన కూరగాయలను చూశారు. అనంతరం డార్మెటరీకి వెళ్లి విద్యార్థినులకు సరిపడా దుప్పట్లు ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. చివరగా వసతి గృహం లోని మెనూ బోర్డును చూసి గురువారం నాటి అల్పాహారం కిచిడి ఉండగా విద్యార్థినులకు జీరా రైస్ వడ్డించిన విషయాన్ని గుర్తించిన కలెక్టర్ అక్కడి సిబ్బందిని ప్రశ్నించారు. . మెనూ ప్రకారం కాకుండా వేరే అల్పాహారం ఎలా ఇస్తారని నిలదీశారు. ఇకపై క్రమం తప్పకుండా మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలని సూచించారు. తినడానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని విద్యార్థినులకు చెప్పారు.

వంట చేసే సిబ్బంది కూడా పరిశుభ్రత పాటించాలని, వంట గది, కూరగాయలు, స్టోర్ గది శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. వంట చేసే ముందు కూరగాయలు, బియ్యాన్ని శుభ్రంగా కడగాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ సమీపంలోనే గల ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి అక్కడి విద్యార్థులు తింటున్న అల్పాహారాన్ని పరిశీలించి, అల్పాహారం ఎలా ఉండని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అయితే బాలుర వసతి గృహాo లో మాత్రం కిచిడి ఉండటంతో ఇక్కడ మెనూ ప్రకారం ఇస్తున్నారు ?. మరి బాలికల వసతి గృహాo లో ఎందుకు ఇవ్వలేదని మరోసారి వార్డెన్ ను ప్రశ్నించారు. వంటగది కి వెళ్లి సరకుల నాణ్యత ను చూశారు. వంట చేసే సిబ్బంది చేతి తొడుగులు, హెడ్ క్యాప్ లను ధరించి, శుభ్రమైన చేతులతో వంట చేయాలన్నారు. కాగా ఒకరిద్దరు విద్యార్థులు వసతి గృహం లో నీళ్ళు నాలుగు రోజులుగా రావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడి నీటిని సరఫరా చేయించాలని అక్కడి వార్డెన్ ను ఆమె ఆదేశించారు. అలాగే వసతి గృహాలకు బయట నుంచి తెస్తున్న ప్యూరిఫైడ్ వాటర్ నమూనాలను తీసుకుని పరీక్ష చేయించాలని సూచించారు.

Advertisement

Next Story