విద్యుత్ కోతలను నిరసిస్తూ జాతీయ రహదారిపై రైతుల ధర్నా..

by Kalyani |   ( Updated:2023-02-09 12:41:55.0  )
విద్యుత్ కోతలను నిరసిస్తూ జాతీయ రహదారిపై రైతుల ధర్నా..
X

దిశ, జడ్చర్ల: విద్యుత్ సరఫరాలో కోతలను నిరసిస్తూ గురువారం జడ్చర్ల మండల పరిధి గంగాపూర్ వద్ద 167 జాతీయ రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రస్తుతం యాసంగి సీజన్ లో భాగంగా మొక్కజొన్న, వరి, కూరగాయల పంటలు సాగు చేశామని, విద్యుత్ సరఫరా గంటకు ఓ సారి నిలిపేయడంతో పంట చేతికొచ్చే సమయంలో నీరందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంట దిగుబడికి పెట్టిన పెట్టుబడి ఖర్చు వృథా అవుతోందని అన్నారు. వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ గొప్పగా చెబుతున్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు.

సమయపాలన లేని విద్యుత్‌ కోతల కారణంగా పంటలకు తీవ్ర నష్టం ఏర్పడుతుందన్నారు. గత రెండు రోజుల నుంచి వ్యవసాయ పొలాలకు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపేశారని, పశువులకు తాగడానికి కూడా నీరు దొరకడం లేదని వాపోయారు. అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కనీసం రోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్న 2 గంటల వరకు అంతరాయం లేకుండా, అలాగే రాత్రివేళలో 5 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న జడ్చర్ల పట్టణ సీఐ రమేష్ బాబు రైతులతో మాట్లాడి ధర్నా విరమించే ప్రయత్నం చేయగా, వారు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ అయ్యే వరకు ధర్నా విరమించేది లేదని జాతీయ రహదారిపై భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి విద్యుత్ సమస్య తీరుస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.

పవర్ జనరేటర్ చెడిపోవడం వల్లనే ఈ సమస్య: డీఈ కృష్ణమూర్తి

ఖమ్మంలోని విద్యుత్ సరఫరా అయ్యే పవర్ జనరేటర్లు చెడిపోవడం వలన జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రెండు రోజుల్లో పవర్ జనరేటర్ మరమ్మత్తు పూర్తి అవుతుంది. రెండు రోజుల తరువాత వ్యవసాయ రంగానికి యధావిధిగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తాం. రైతులు అధైర్య పడొద్దు.

Advertisement

Next Story