ముఖ్యమంత్రికి నియోజక వర్గ సమస్యలను వివరిస్తా : ఎమ్మెల్యే

by Kalyani |
ముఖ్యమంత్రికి నియోజక వర్గ సమస్యలను వివరిస్తా : ఎమ్మెల్యే
X

దిశ, కొత్తకోట: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేవరకద్ర నియోజకవర్గ సమస్యలను వివరిస్తానని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. సోమవారం కొత్తకోటలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన 61 కల్యాణలక్ష్మి చెక్కులు, 29 షాది ముబారక్ చెక్కుల పంపిణీ ఎమ్మెల్యే చేతుల మీదుగా 90 చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మంగళవారం రోజు ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ జిల్లాకు వస్తున్నారని ఉమ్మడి జిల్లాలోని ఎమ్యెల్యేలతో పాటు ముఖ్యమైన శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ జరుగుతుందని ఎమ్యెల్యే జీఎంఆర్ తెలిపారు.

విద్యా, వైద్యం, ఉమెన్ ఎంపవర్ మెంట్ తదితర శాఖలపై సమీక్ష చేస్తారని ఆయన తెలిపారు. ముఖ్యంగా మన దేవరకద్ర నియోజక వర్గానికి సంబంధించి ప్రధానంగా కోయిల్ సాగర్ ప్రాజెక్టు కింద పెండింగ్ లో ఉన్న పనులు, శంకర సముద్రం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సమస్యను పరిష్కరించి శంకర సముద్రం నీటిని కుడి కాలువ ద్వారా దేవరకద్ర నియోజకవర్గం లోని గ్రామాలకు నీరందించాలని, సరళసాగర్ ను పర్యాటక కేంద్రంగా చేయాలని ముఖ్యమంత్రిని కోరతామన్నారు. వైద్యానికి సంబంధించి దేవరకద్రలో 100 పడకల ఆసుపత్రి, కొత్తకోటలో 50 పడకల ఆసుపత్రి తో పాటు, జాతీయ రహదారిపై జరిగే ప్రమాదాలకు తక్షణ వైద్యం అందించడానికి ప్రతి 40 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరతామన్నారు.

అదేవిధంగా కొత్తకోటలో ఉర్దూ మీడియం కాలేజీ, బాలికల కోసం ఒక ప్రత్యేకమైన పాఠశాలను కోసం అనుమతులు కోరతామన్నారు. ప్రతి మండలంలో మహిళల కోసం క్యాంటీన్లు ఏర్పాటు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారని జీఎంఆర్ తెలిపారు. గత ముఖ్యమంతులకు భిన్నంగా జిల్లాలల్లో ఉన్న సమస్యను తన దృష్టికి తెమ్మని చెప్పడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుకేశిని విశ్వేశ్వర్, వైస్ చైర్మన్ జయమ్మ, రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు పల్లెపాగు ప్రశాంత్, డాక్టర్ పీ జె బాబు, బోయేజ్, కృష్ణారెడ్డి, బీచుపల్లి, మేస్త్రి శ్రీను, ఎల్లంపల్లి నరేందర్ రెడ్డి, వేముల శ్రీనివాస్ రెడ్డి, శేఖర్ రెడ్డి, మిషేక్, నవీన్, సుభాష్, సంధ్య, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story