బీఆర్ఎస్ అభ్యర్థులను ఢీకొట్టే వారెవరో..! కాంగ్రెస్ జాబితాపై ఉత్కంఠ

by Hamsa |   ( Updated:2023-08-23 05:57:39.0  )
బీఆర్ఎస్ అభ్యర్థులను ఢీకొట్టే వారెవరో..! కాంగ్రెస్ జాబితాపై ఉత్కంఠ
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: అధికార బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించడంతో వారిని వచ్చే ఎన్నికలలో ఢీకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు రంగంలో నిలిచే అవకాశాలు ఉన్నాయి అన్న అంశంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో కేవలం మూడు నియోజకవర్గాలలో మాత్రం ఒక్కొక్క అభ్యర్థి మాత్రమే టికెట్ ఆశిస్తుండగా.. మిగిలిన నియోజకవర్గాలలో టికెట్ కోసం ఆశావహులు పోరా హోలీగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అచ్చంపేటలో డాక్టర్ వంశీకృష్ణ, అలంపూర్ లో సంపత్ కుమార్ మాత్రమే పోటీలో ఉండేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

వీరికి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా మొదటి జాబితాలో టికెట్లు లభించి బీఆర్ఎస్ అభ్యర్థులను ఢీకొనడానికి సన్నద్ధం అవుతున్నారు. జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, పీసీసీ కార్యదర్శి అనిరుద్ రెడ్డి టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు సాగిస్తున్నారు. ఎవరికివారు టికెట్ నాదే అన్న ధీమాతో ఉన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్ రెడ్డి, ఇటీవల పార్టీలో చేరిన రాఘవేందర్ రెడ్డి టికెట్ రేసులో ఉండగా నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర నాయకుడు జగదీశ్వర్ రావు ఎవరికివారు టికెట్ అంశంపై ధీమాగా ఉన్నారు. వనపర్తి నియోజకవర్గం నుంచి ముగ్గురు టికెట్ కోసం కాపు కాస్తున్నారు.

మాజీ మంత్రి డాక్టర్ చిన్నారెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి, ఇటీవల పార్టీలో చేరిన పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి టికెట్ విషయంలో హోరాహోరీ ప్రయత్నాలు సాగిస్తున్నారు. శివసేన రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి వర్గీల మధ్య టికెట్ అంశంపై పలు సందర్భాలలో గొడవలు కూడా జరిగాయి. గద్వాలలో జెడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, డీసీసీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి రంగంలో ఉన్నారు. మక్తల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి, యువ నేత , దివంగత మాజీ ఎమ్మెల్యే తనయుడు ప్రశాంత్ రెడ్డి ప్రయత్నాలు సాగిస్తున్నారు. నారాయణపేట నియోజకవర్గం నుంచి మాజీ డీసీసీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి టికెట్టు వేటలో ఉన్నారు.

మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పీసీసీ ఉపాధ్యక్షుడు కొత్వాల్, సంజీవ్ ముదిరాజ్ ప్రయత్నాలు సాగిస్తుండగా, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వసంత భర్త రఘు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో టికెట్ కోసం ముగ్గురు తీవ్ర ప్రయత్నాలు డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి కాటం ప్రదీప్ గౌడ్, యువ నాయకుడు ప్రశాంత్ రెడ్డి టిక్కెట్టు కోసం తమ తమ గాడ్ ఫాదర్ ల ద్వారా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.ప్రతి నియోజకవర్గంలో నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో రెండు మూడు నియోజకవర్గాలు మినహాయించి మిగతా అన్ని నియోజకవర్గాలలో ఈ పేర్లలో నుంచి ఎవరైనా ఒకరికి అవకాశం లభించనుంది. మరో రెండు మూడు నియోజకవర్గాలలో ఊహించని విధంగా కొత్త నేతలు తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

అభ్యర్థుల ఎంపిక మరింత ఆలస్యం

కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల ను ఎంపిక చేసే ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 25వ తేదీ వరకు ఆశావహులు దరఖాస్తు చేసుకునే గడువును నిర్ణయించిన విషయం పాఠకులకు విధితమే. అంతవరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుంచి 5 దఫాలుగా సాగిన సర్వేల ఆధారంగా గెలుపు అవకాశాలు మెండుగా ఉన్న వారికే టికెట్లు కేటాయించాలన్న నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. పలు నియోజకవర్గాలలో గెలిచే అవకాశాలు లేని వారి స్థానాలలో ఇతర పార్టీల నుండి వచ్చే బలమైన నాయకులను గాని, ఎన్నారై, పారిశ్రామికవేత్తలను గాని రంగంలోకి దించే ఆలోచనలలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి మరో నెల రోజులు పట్టే అవకాశం ఉందని సమాచారం.

Advertisement

Next Story