కల్తీకల్లు వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ మంత్రి బాధ్యత వహించాలి: డీకే అరుణ

by Kalyani |
కల్తీకల్లు వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ మంత్రి బాధ్యత వహించాలి: డీకే అరుణ
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కల్తీకల్లు కారణంగా ఇద్దరు మృతి చెందగా, మరో 40మందికి పైగా ఆసుపత్రి పాలు కావడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని, అందుకు ఎక్సైజ్ శాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆమె స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తండాలలో గుడుంబా వ్యాపారానికి అడ్డుకట్ట వేసి, స్వచ్ఛమైన కల్లు విక్రయాలు చేపడతామని చెప్పి కల్తీకల్లు విక్రయాలు చేయిస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటారా అని ఆమె ప్రశ్నించారు.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంతో పాటు పరిసర గ్రామాలలో గత కొన్ని సంవత్సరాలుగా కల్తీకల్లు వ్యాపారాలు జోరుగా సాగుతున్నా పట్టించుకోకుండా ఉండడం వల్లే అమాయక ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని ఆమె ఆరోపించారు. గత వారం రోజుల నుంచి కల్తీకల్లుకు సంబంధించి బాధితులు పెద్ద ఎత్తున జిల్లా ఆసుపత్రికి వస్తూ చికిత్సలు పొందుతున్నారు. ఈ విషయాన్ని బయటకు పోకుండా ఎందుకు మూసిపెట్టారో సమాధానం చెప్పాలని డీకే అరుణ మంత్రిని డిమాండ్ చేశారు. కల్తీకల్లు సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు, వైద్య సేవలు పొందుతున్న వారికి రూ. 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

టీఎస్పీఎస్సీ, టెన్త్ క్లాస్ పరీక్షల పేపర్ల లీకేజీ వ్యవహారంలోనూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులను ఒప్పుకోకుండా, బీజేపీ పార్టీపై మోపేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలోని జరిగిన సంఘటన దారుణమని అన్నారు. సిలిండర్ పేలిన సంఘటన బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, రాష్ట్ర నాయకురాలు పద్మజారెడ్డి, జిల్లా నేతలు ఎన్ పీ వెంకటేష్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed