CM Revanth Sabha : సీఎం రేవంత్ సభకు సర్వం సిద్ధం

by Kalyani |
CM Revanth Sabha : సీఎం రేవంత్ సభకు సర్వం సిద్ధం
X

దిశ, కల్వకుర్తి : ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కల్వకుర్తి పర్యటనలో భాగంగా మూడ్రోజులుగా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి దివంగత సూదిని జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహం ప్రారంభం అనంతరం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ప్రక్కన గల బిఎస్ఎన్ఎల్ మైదానంలో సాయంత్రం 4 గంటలకు సభ జరగనున్నది. మైదానాన్ని చదును చేసి బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను కల్పించేలా చేశారు. ముఖ్యమంత్రి సభకు వచ్చే ప్రజలకోసం ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేశారు. 70 వేల పైచిలుకు జనసమీకరణ చేసేలా అధికారులు ప్రణాళిక చేశారు.

స్థానిక ఎన్నికల టైమ్‌ దగ్గర పడుతుండడంతో అసెంబ్లీ వేదికగా ప్రజలకు, ఉద్యోగులకు వరాల జల్లు కురిపిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎడతెరపని ముసుర్లు కురుస్తుండటంతో నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి సుమారు 30 వేల మంది సభకు హాజరయ్యే అవకాశం ఉంది. 99 సర్వే లో గల డబుల్ బెడ్ రూమ్ ఎదురుగా ఖాళీ స్థలంలో వాహనాల పార్కింగ్‌, క్రీడ మైదానంలో హెలిప్యాడ్‌ ల్యాండ్ కు సిద్ధం చేశారు. అలాగే హెలిప్యాడ్‌ నుంచి దాదాపు 250 మీటర్ల దూరంలోనే సభకు ఏర్పాట్లు చేశారు. శనివారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ సమావేశ మందిరంలో సీఎం పర్యటన, ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అధికారులకు దిశా నిర్దేశాలు చేశారు.

సీఎం పర్యటనలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ప్రదేశాలకు ప్రయాణించే వెంబడి అవసరమైన బారికేడ్లను ఆర్ అండ్ బి అధికారులు,శానిటేషన్ - పచ్చదనం - బయో టాయిలెట్ వంటి ఏర్పాట్లను పురపాలక శాఖ అధికారులకు అప్పగించారు. ఏ అధికారులు ఎక్కడ పనిచేయాలో కలెక్టర్ వారికి సూచించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ నేతృత్వంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ప్రత్యేక పోలీసు బలగాలు బందోబస్తులో పాల్గొననున్నారు.

ముఖ్యమంత్రి హోదాలో మొదటి సారి తన సొంత గడ్డ ఐన కల్వకుర్తి కి వస్తుండటంతో నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి పై ఆశలు పెంచుకుంటున్నారు. కొన్ని ఏండ్లగా నియోజకవర్గం లో పేరుకు పోయిన సమస్యలు తీరుతాయని ప్రజలు ఆశలకు హద్దులు లేకుండా పోయింది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో భూములు కోల్పోయి నేటికి పైసల్ జమకాని భూ నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని, కేఎల్ ఐ ద్వార పూర్తి స్థాయిలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు నీళ్ళు అందాయని ఆశగా ఎదురుచూస్తున్న వారికి సీఎం ఏవేవి హామీలు ఇస్తాడో ఆశగా చూస్తున్నారు.

కల్వకుర్తి ప్రాంతంలో బీటెక్ కాలేజ్, పీజీ కాలేజ్, మెడికల్ కాలేజీలు లేకపోవడంతో యువతీ, యువకులు వివిధ ప్రాంతాల్లోకి వెళ్లి చదువుకుంటున్నారు. వారి కోసం కాలేజీల ఏర్పాటుకు సీఎం హామీ ఇస్తాడేమోనని ఎదురుచూపులు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి కల్వకుర్తి అభివృద్ధికి ఎలాంటి వరాల జల్లులు కురిపిస్తడెమో అని ఆశలు పెట్టుకుంటున్నారు. నియోజకవర్గ ప్రజలందరూ సభకు రావాలని, పార్టీ అభిమానులు తరలిరావాలని ప్రజాప్రతినిధులు ఆయా మండలాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో పిలుపునిచ్చారు. ఎవరికీ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.



Next Story

Most Viewed