వనపర్తి నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు..

by Sumithra |
వనపర్తి నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు..
X

దిశ ప్రతినిధి, వనపర్తి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వనపర్తి నియోజకవర్గంలో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. వనపర్తి నియోజకవర్గంలో 296 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించగా 72.6% పోలింగ్ నమోదయింది. నిబంధనల ప్రకారం గురువారం ఉదయం 5.30 గంటలకు ఎన్నికల అధికారులు ఆయా పార్టీల ఏజెంట్ల ముందు మాక్ పోలింగ్ నిర్వహించి అన్ని క్లియర్ చేసిన అనంతరం ఉదయం 7 గంటలకు పోలింగ్ ను ప్రారంభించారు. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో పోలీసుల పహార మధ్య ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు.

కాగా గోపాల్పేట మండలం పోలికేపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 100 మంది పేర్లు ఓటరు జాబితాలో గల్లంతయ్యాయని సదరు పేర్లు తాడిపర్తి గ్రామంలోని జాబితాలో ప్రత్యక్షమవడంతో అధికార పార్టీ వారు కావాలని తొలగించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి పట్టణంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక కాంగ్రెస్ తూడు మేఘారెడ్డి పెద్దమందడి మండలంలోని తన సొంత గ్రామం మంగంపల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో పాటు జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి సైతం వనపర్తి లో ఓటు వేశారు.

Advertisement

Next Story

Most Viewed