- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లేని వ్యక్తిని సృష్టించారు..ఆరున్నరెకరాలు కొట్టేశారు
దిశ,సంగారెడ్డి బ్యూరో/ ఆందోల్: ఒకప్పుడు మహానగరాలకు పరిమితమైన ఫేక్ భూ రిజిస్ట్రేషన్లు గ్రామీణ ప్రాంతాలకు సైతం వ్యాపించాయి. చాలా రోజులుగా ఖాళీగా ఉన్న భూములపై కన్నేసి కాజేస్తున్నారు. ఏకంగా చనిపోయిన వ్యక్తి పేరుతో విలువైన భూములను స్వాహా చేశారు. ఎప్పుడో ప్రాణం పోయిన వ్యక్తిని ఆందోల్ మండలం లో కొందరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మళ్ళీ బతికించారు. చనిపోయిన వ్యక్తి పేరుతో ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి భూముల్ని మాయం చేశారు. తమకున్న రాజకీయ పలుకుబడి, అధికారుల అండతో పరాయి భూమిని తమ వశం చేసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అందోల్ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపే భారీ భూ కుంభకోణం చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.....
ఆందోల్ మండలం డాకూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే 679లో చనిపోయిన వ్యక్తి పేరుతో ఫోర్జరీ ఆధార్ కార్డు తయారు చేసి సుమారు రూ.7 కోట్ల విలువైన ఆరున్నర ఎకరాల భూమి కొట్టేశారు. హైదరాబాద్ నగరానికి చెందిన ఒక వ్యక్తి సర్వే నం. 679 సుమారు ఆరున్నర ఎకరాల భూమిని స్థానిక రైతుల నుంచి కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి అదే గ్రామానికి చెందిన రైతులకు సాగు చేసేందుకు గాను కౌలుకు ఇచ్చారు. అప్పటి నుంచి మధ్య మధ్యలో తన భూమిని చూసుకునేందుకు తరచు వచ్చేవాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి మరణించడంతో భూమి దగ్గరకు ఆ యజమానికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఏండ్ల తరబడి ఎవ్వరూ రాకపోవడంతో ఓ మాజీ ప్రజా ప్రతినిధి ఆ భూమి పై కన్నేశారు. సదరు వ్యక్తికి వారసులు లేరని భావించి ఎలాగైనా ఆ విలువైన భూమిని కొట్టేయడానికి పక్క స్కెచ్ వేశాడు. అనుకున్నదే తడవుగా తనకు దగ్గర ఉండే మరొక ప్రజా ప్రతినిధికి తక్కువ ధరకు భూమి ఇప్పిస్తానని నమ్మబలికాడు.
స్కెచ్ వేసి భూమిని కాజేశారు...
డాకూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 679 కి సంబంధించిన భూమిపై స్కెచ్ చేసిన సదరు మాజీ ప్రజా ప్రతినిది సులువుగా ఆ భూమిని అమ్మడానికి ప్లాన్ చేశాడు. ఆందోల్ రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి సహకారంతో మరణించిన వ్యక్తికి సంబంధించిన ఆధార్ కార్డును సేకరించారు. చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డుతో సదరు మాజీ ప్రజా ప్రతినిధి అదే అధికారి సహాయంతో ఆధార్ కార్డు లో ఫోటోను మార్పింగ్ చేశారు. ఆధార్ కార్డు ఫోటో మార్పింగ్ తో పాటు వేరే మొబైల్ నెంబర్ ని ఆధార్ కార్డుకు జతచేసి పక్క పథకం రచించారు. ఆ తర్వాత 2023 ఫిబ్రవరి 23న మరో వ్యక్తి ద్వారా పట్టా పాస్ పుస్తకానికి ఆధార్ కార్డు జత చేశారు. ఆ తర్వాత అదే మరో వ్యక్తిని భూ యజమానిగా చూపించి 2023 మార్చి 28 న మరో మాజీ ప్రజా ప్రతినిధికి భూమిని విక్రయించారు.
మళ్ళీ భూమి విక్రయం..
సర్వేనెంబర్ 679 లో వివాదాస్పద భూమిని కొనుగోలు చేసిన మరో మాజీ ప్రజా ప్రతినిధి ఆ భూమిని తిరిగి పలువురికి విక్రయించారు. నకిలీ రిజిస్ట్రేషన్ తో భూ రిజిస్ట్రేషన్ చేసిన విషయం సదరు ప్రజాప్రతినిధికి తెలిసి ఆ భూమిని వేరే వాళ్లకు విక్రయించారా..? లేక విషయం తెలియక విక్రయించారా..? అనేది తెలియాల్సి ఉంది. నకిలీ ఆధార్ కార్డు తో రిజిస్ట్రేషన్ చేసిన విషయం తనకు తెలియదని ఆ భూమిని కొనుగోలు చేసిన ప్రజా ప్రతినిధి పలువురి దగ్గర వాపోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భూమిని తిరిగి కొనుగోలు చేసిన వ్యక్తులు పూర్తి విషయం బయటికి పోవడంతో లబోదిబోమంటున్నారు. నకిలీ రిజిస్ట్రేషన్ విషయం తెలియక తాము భూమిని కొనుగోలు చేశామని ఇప్పుడు కోట్ల రూపాయల కుమ్మరించి భూమిని కొన్న తమకు న్యాయం ఎవరు చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వివాదం బయటపడిందిలా..
డాకూర్ గ్రామంలో గతంలో భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి అనారోగ్యంతో మరణించారు. అయితే మరణించిన వ్యక్తికి సంబంధించిన వారసురాలు విదేశాల్లో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. మరణించిన సమయంలో ఆస్తుల విషయంలో పెద్దగా పట్టించుకోనట్లు తెలుస్తోంది. అయితే తర్వాత విదేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన సదరు కుటుంబ సభ్యులు ఇంట్లో డాక్యుమెంట్లను తనిఖీ చేస్తుండగా డాకూర్ గ్రామానికి సంబంధించిన భూమి పట్టా పాస్ బుక్కులు లభ్యమైనట్లు సమాచారం. సదరు సర్వేనెంబర్లను ధరణిలో చెక్ చేయగా తమ తండ్రి పేరు ఉన్న భూమిలో వేరే వ్యక్తుల పేర్లు దర్శనమీయడంతో వారు అవాక్కయ్యారు. భూ యజమాని మరణించిన తర్వాత తేదీల్లో పట్టా మార్పిడి జరిగిన విషయం గమనించిన ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని తమ కుటుంబానికి స్నేహితుడైన ఒక ఐపీఎస్ అధికారి దృష్టికి తీసుకు వెళ్లడంతో డొంక కదిలింది. అయితే అక్రమ భూ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులకు రాజకీయ పలుకుబడి ఉండడంతో ఈ విషయం బయట పొక్కకుండా అసలైన భూ యజమాని కుటుంబ సభ్యులతో బేరసారాలకు దిగినట్లు తెలిసింది.
అయితే సదరు వ్యక్తులు వీరితో సెటిల్మెంట్ ససేమిరా అనడంతో తమకున్న పొలిటికల్ ఒత్తిడితో పోలీస్ అధికారులను మేనేజ్ చేసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.ఈ విషయంలో ఫిర్యాదు వచ్చిన పోలీసు అధికారులు ఈ విషయాన్ని తొక్కిపెట్టడంతో సదరు కుటుంబ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.కోర్టు ఉత్తర్వుల మేరకు రెవెన్యూ అధికారులు ప్రస్తుతం ఆ భూమిని నిషేధిత జాబితాలో చేర్చారు.
అయితే సామాన్యులపై చిన్న ఆరోపణ వస్తేనే చర్యలకు ఉపక్రమించే పోలీసు రెవెన్యూ అధికారులు ఇంత పెద్ద భూ కుంభకోణం బయటకు వచ్చిన మౌనంగా ఉండటం స్థానికంగా చర్చనీయాంశమైంది.చనిపోయిన వ్యక్తి పేరుతో ఆధార్ కార్డును సృష్టించినట్లు పక్క ఆధారాలున్నా సదురు వ్యక్తులపై పోలీస్ శాఖ చర్యలు తీసుకోవడంలో వెనకంజ వేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ భూతతంగంపై సహకరించి కబ్జాదారులకు కొమ్ముకాస్తున్న అధికారుల భరతం పట్టాల్సిన అవసరం ఉంది. ఆధార్ కార్డు ఫోర్జరీ చేసి పోలీస్ శాఖ తో పాటు రెవెన్యూ శాఖను తప్పుదోవ పట్టించిన సదరు మాజీ ప్రజాప్రతినిధులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం ఉంది.