రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తాంః మంత్రి జూపల్లి ప్రకటన

by Nagam Mallesh |
రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తాంః మంత్రి జూపల్లి ప్రకటన
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్రంలో టెంపుల్ టూరిజంతో పాటు ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రానికి సమీపంలోని ప్రఖ్యాతి గాంచిన పిల్లలమర్రి వృక్షాన్ని, ఆధునీకరించిన పార్కును ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జీ.మధుసూధన్ రెడ్డిలతో కలిసి మంత్రి జూపల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రామప్ప దేవాలయం, పాండవుల గుట్ట, గోల్కొండ వంటి ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని అన్నింటినీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో నల్లమల అభయారణ్యం, మల్లెల తీరం, సోమశిల, సరళాసాగర్, కోయిల్ సాగర్ తో పాటు ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వీటన్నింటినీ కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా టూరిజం అభివృద్ధికి తక్షణమే రూ.5 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అంతేకాకుండా ఉమ్మడి జిల్లాలో 150 కిలోమీటర్ల నిడివి గల కృష్ణానది ఉందని, కృష్ణ బ్యాక్ వాటర్ లో వాటర్ స్పోర్ట్స్, బోటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ నెలలో ఒక్కసారైనా ఉపశమనం పొందేందుకు పర్యాటక ప్రాంతాలను తీర్చిదిద్దుతామని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఎస్పీ జానకి, మున్సిపల్ చైర్మెన్ ఆనంద్ గౌడ్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story