Eatala Rajender: కేసీఆర్.. మునుగోడులో బీజేపీ స్ట్రాటజీ చూపిస్తాం: ఈటల ఫైర్

by Satheesh |   ( Updated:2022-08-08 13:57:47.0  )
Eatala Rajender Says BJP to win Munugode By - elections
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్/చిన్న చింతకుంట: Eatala Rajender Says BJP to win Munugode By - elections| వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడ గొట్టకుంటే మా జీవితాలకు సార్థకత ఉండదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం మహబూబ్ నగర జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చింతకుంట మండలంలో నిర్వహించిన ప్రజల గోస- బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశంలో ఈటల మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మొదటినుండి మోసం చేస్తూ వస్తున్నారన్నారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పాడు.. కానీ ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడని విమర్శించారు. 0.5 శాతం కూడా లేని వారికి కీలక మంత్రి పదవులు అప్పజెప్పారని.. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్క మంత్రి పదవి, 52 శాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులు మాత్రమే ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో సామాజిక న్యాయం ఎక్కడ ఉందో ప్రజలు గుర్తించాలని ఈటల పేర్కొన్నారు. భూ స్వాములకు లక్షలకు లక్షలు రైతుబంధు పేరుతో డబ్బులు ఇస్తున్నారు.. ఆ డబ్బులు మనవి కాదా అని ప్రశ్నించారు. నేను మొదట్లో మంత్రిని అయినప్పుడు మద్యం అమ్మ కాల ద్వారా 10వేల కోట్ల రూపాయలు మాత్రమే వచ్చేవి, ఇప్పుడు 40 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు. అదంతా పేదల కష్టార్జితం కాదా.. అని నిలదీశారు.

కష్టించి సంపాదించిన డబ్బులకు కాపలాదారుడు కాదు.. ఓనరు అని చెప్పుకుంటున్నాడు.. కళ్యాణ లక్ష్మికి డబ్బులు ఇచ్చి మేనమామను అంటున్నాడు.. పింఛన్ ఇచ్చి పెద్ద కొడుకుని అంటున్నాడు. ఇస్తున్న డబ్బులు ఏమైనా కేసీఆర్ జాగీరా .? ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి అని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే పింఛన్లు, రేషన్ కార్డులు ఇస్తామంటున్నాడని.. ఇవన్నీ ఎన్నికల ఎత్తు గడలో భాగమే అని తెలిపారు. ఎత్తుగడలు వేయడం.. ఎన్నికలలో గెలవడం మీకే కాదు కేసీఆర్.. ఎత్తుగడలు ఎలా వేయాలో మాకు తెలుసు అని చెప్పారు. మా స్ట్రాటజీ మునుగోడు ఎన్నికలలో చూపుతామని స్పష్టం చేశారు.

119 నియోజకవర్గాలు తిరుగుతాం.. లోపాలను ఎండగట్టి.. ఎన్నికలలో నిన్ను ఓడించకుంటే మా జీవితాలకు సార్థకత ఉండదన్నారు. టీఆర్ఎస్‌కు ఓటు వేసిన, కాంగ్రెస్కు ఓటు వేసిన ఒకటే అని ప్రజలకు అర్థం అయ్యింది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్రంలో జెట్ స్పీడ్ వేగంతో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మూడున్నర సంవత్సరాలుగా మునుగోడును కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు.. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి అధికార టీఆర్ఎస్‌ పార్టీలో చేరి పదవులను అనుభవిస్తున్న ఎమ్మెల్యేల్లారా.. మీకు దమ్ముంటే ప్రజాభిప్రాయాన్ని కోరాలని ఈటల సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి, నేతలు నందిరాజు, సుదర్శన్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, ఎగ్గని నర్సింలు, గంగాధర్ రెడ్డి, కొండయ్య, గోపాల్ రెడ్డి, కురువ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ఉద్యమ ద్రోహి పాలనలో పైలం బిడ్డో.. కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

Advertisement

Next Story