ప్రమాదకరంగా రైల్వే అండర్ బ్రిడ్జిలు

by Prasanna |
ప్రమాదకరంగా రైల్వే అండర్ బ్రిడ్జిలు
X

దిశ, అలంపూర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు గ్రామాలకు వెళ్లే దారుల్లో అండర్ పాస్ రైల్వే బ్రిడ్జిలు ప్రమాదకరంగా మారాయి. చిన్నపాటి వర్షం కురిసినా పది అడుగుల మేరకు నీళ్లు నిలుచుంటున్నాయి. దీంతో పలు గ్రామాలకు వెళ్లే దారులు పూర్తిగా స్తంభించి పోతున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షాకాలం సీజన్‌లో నెలరోజులు గడిచినా రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిల వద్ద నీళ్లు మాత్రం బయటికి పోవడం లేదు. దీంతో ప్రజలు రాకపోకలు సాగించడం కష్టతరంగా మారుతుంది. గతంలో గేట్లు దాటే వెళ్లే విధానాలే మెరుగ్గా ఉండేవని పలు గ్రామాల ప్రజలు అంటున్నారు.

పరిస్థితులు అధ్వానం..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో అండర్ రైల్వే బ్రిడ్జిల కొత్త పరిస్థితులు అయోమయంగా ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని వల్లూరు, నారాయణపురం గ్రామాలకు వెళ్లి ప్రధాన దారులు పూర్తిగా స్తంభించిపోయాయి. అండర్ పాస్ బ్రిడ్జిలు మునిగి పోయేలా వర్షపు నీరు నిలిచిపోయాయి. గత వారం కిందట జిల్లా కలెక్టర్, మండల అధికారులు పరిశీలించినా బ్రిడ్జి కింద నిలిచిన వర్షపు నీటిని మాత్రం ఇంకా తోడయలేదు. దీంతో ఆ గ్రామాల ప్రజలు బయటికి వచ్చే రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని బండమీదిపల్లి, దేవరకద్ర, వెంకటాయపల్లి, గొల్లపల్లి, రాజాపూర్, బాలానగర్, పెద్దపల్లి గ్రామాల వద్ద రైల్వే శాఖ అండర్ వే బ్రిడ్జిలను నిర్మించారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ మార్గాలు అన్ని వర్షపు నీటితో మునిగిపోతున్నాయి. ట్రాక్ ఇటువైపు, అటువైపు మధ్య రాకపోకలు సాగించేందుకు ఈ మార్గాలను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. కానీ వర్షాలు కురిస్తే మాత్రం పరిస్థితులు తీవ్ర ఇబ్బందికరంగా మారుతున్నాయి. గత ఏడాది దేవరకద్ర సమీపంలోని వెంకట్రాంపల్లి వద్ద ఓ పాఠశాల బస్సు నీటిలో చిక్కుకుంది. ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు అప్పట్లో హామీ ఇచ్చినా అవి ఇప్పటివరకు అమలు కాలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రైల్వేశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story