పాలమూరులో 14 స్థానాలు గెలిపిస్తే ప్రాజెక్టులతో పాటు పరిశ్రమలు తీసుకొస్తా.. రేవంత్ రెడ్డి

by Sumithra |   ( Updated:2023-11-01 14:15:34.0  )
పాలమూరులో 14 స్థానాలు గెలిపిస్తే ప్రాజెక్టులతో పాటు పరిశ్రమలు తీసుకొస్తా.. రేవంత్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్ / కల్వకుర్తి / జడ్చర్ల : మిడ్జిల్ మండలం ప్రజల ఆశీర్వాదంతో జడ్పీటీసీగా గెలిచిన నేను అంచలంచలుగా ఎదిగి రాష్ట్రంలోని 119 స్థానాలకు టికెట్లు ఇచ్చే స్థాయికి చేర్చారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో పాలమూరు ప్రాంతంలోని 14 స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ఈ ప్రాంత ప్రాజెక్టులతో పాటు యువత కోసం నూతనంగా పరిశ్రమలను కూడా తీసుకువస్తానని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ విజయభేరి కార్నర్ మీటింగ్, జడ్చర్లలో నిర్వహించిన రోడ్ షో మీటింగ్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి కీర్తి ప్రతిష్టలను ఢిల్లీ గడ్డన ఎగరవేసి ఉత్తమ పార్లమెంట్ నేతగా ఎదిగిన కీర్తిశేషులు జైపాల్ రెడ్డి, మరో నేత గోపాల్ రెడ్డి, ప్రస్తుత ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీ చందర్ రెడ్డి చివరకు మీ అభిమానంతోనే మిడ్జీల్ జడ్పీటీసీగా గెలుపొంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని తీసుకొచ్చేందుకు సోనియా గాంధీ టీపీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలను అప్పగించిందన్నారు.

ఇదే అభిమానం ఆప్యాయతతో వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపిస్తే ఉమ్మడి పాలమూరు ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు నూతన పరిశ్రమలను కూడా తీసుకొస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ తెచ్చానని చెప్పుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ కు రెండుసార్లు అవకాశం ఇస్తే కనీసం ఇప్పటిదాకా సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేయలే.. వలసలు అగలే మన బతుకులు మారలేదన్నారు. పాలమూరు బిడ్డలు కేసీఆర్ ను పార్లమెంటుకు పంపినా ఈ ప్రాంతంలోని బీడు భూముల్లో ఇంకా పల్లేరు కాయలు మొలుస్తూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వంశి చందర్ రెడ్డి ఏఐసీసీలో పార్టీ కోసం పని చేస్తూ బిజీగా ఉండడం వల్ల ఎమ్మెల్యే టికెట్ను శాక్రిఫైజ్ చేశారని ప్రస్తుత కాలంలో వార్డు మెంబర్ టికెట్ కూడా వదులుకోలేని పరిస్థితిలో వంశీ చందర్ రెడ్డి పార్టీ కోసం తాను కట్టుబడి ఉన్నాడని గుర్తు చేశారు. సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించాడని కానీ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే కలిసి పని చేద్దామని ముందుకు వచ్చాడని గుర్తు చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులను కేవలం కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమే రీ డిజైన్లను చేసుకున్నారని పనిమంతుడు పందిరి వేస్తే కుక్కతోక తగిలి కూలినట్లు రాష్ట్రంలో కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టుల వ్యవహారం తీరు ఇలా ఉందన్నారు.

ఎమ్మెల్యేలు, మంత్రులు మిరప తోటలో దిష్టిబొమ్మలు.. పీసీసీ ఉపాధ్యక్షులు మల్లురవి

తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు మంత్రులు అంతా మిరపతోటలోని దిష్టిబొమ్మలుగా దర్శనమిస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ మల్లురవి మండిపడ్డారు. ఆయా నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు ఆయా శాఖల మినిస్టర్లు ఎవరు కూడా ధైర్యంగా ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోలేరని కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే రాష్ట్రాన్ని ఏలుతున్నారని మండిపడ్డారు. ముస్లింలకు ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కేసీఆర్ మాట మార్చారని గుర్తు చేశారు.

ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అభివృద్ధి కుంటుపడింది.. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి..

కల్వకుర్తి ప్రాంతం విద్య, వైద్యం వ్యవసాయ రంగాలలో తీవ్రంగా వెనకబడింది. తాని అధికార పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం కేవలం ఎమ్మెల్యేలకే అధికారాన్ని ఇవ్వడం మూలంగా ప్రజల నుంచి వచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా వాటిని పరిష్కారం చూపలేదు. ఇదే విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధిలో చాలా వెనుకబడింది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రాంతం పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటుంది.. జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఠాకూర్ బాలాజీ సింగ్.

పదవులను కూడా వదిలేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరితే అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలను సామెంత రాజులుగా మార్చి పోలీసు వ్యవస్థను పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకున్నాడని ఓ నిరంకుశ రాజ్యాన్ని స్థాపించారని నాగర్ కర్నూల్ జిల్లా వైస్ చైర్మన్ ఠాకూర్ బాలాజీ సింగ్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలోని కొంత ప్రాంతంలోనే అభివృద్ధి చేసి మిగతా ప్రాంతాలను గాలికి వదిలేసాడని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత నేటి యువత పైనే ఉందని అందరూ కలిసికట్టుగా పనిచేసే ఈ నియంత కేసీఆర్ కు ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed