కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలు, నీటి కష్టాలు : లక్ష్మారెడ్డి

by Kalyani |   ( Updated:2023-11-12 14:45:32.0  )
కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలు, నీటి కష్టాలు :  లక్ష్మారెడ్డి
X

దిశ, జడ్చర్ల : రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులకే గ్యారెంటీ లేదని ఎప్పుడు ఎవరు సీఎం రేస్ లోకి వస్తారో ఎవరు అలుగుతారో వారికే తెలియదు కానీ ఇక వారి ఆరు గ్యారెంటీలు దేవుడు ఎరుగని, గ్యారంటీ లేని పార్టీ నాయకులను నమ్మి ఆగమవద్దని చేసిన అభివృద్ధిని చూసి మంచి చేసిన వారికి పట్టం కట్టాలని, బీఆర్ఎస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థి సి. లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం జడ్చర్ల మున్సిపాలిటీలోని 23వ వార్డులో బంగారు మైసమ్మ ఆలయంలో అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వార్డులో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వార్డులో ప్రతి ఇంటికి తిరుగుతూ మిషన్ భగీరథ నేటి సరఫరా సరిగా జరుగుతుందా అంటూ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కరెంటు సరఫరా సక్రమంగా జరుగుతుందా అనే ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గత తొమ్మిది ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వార్డులో డ్రైనేజీలు, సీసీ రోడ్ 100% పూర్తి చేశామని మున్సిపాలిటీలో ముఖ్యంగా మంచినీటి కష్టాలు తొలగించామని షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ద్వారా ఆడపిల్లల వివాహాలకు కేసీఆర్ తోడుగా నిలిచారని గుర్తు చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక నూతనంగా ప్రవేశపెట్టిన సౌభాగ్య లక్ష్మి పథకం, ప్రతి పౌరుడికి 5 లక్షల ఉచిత బీమా, విడతల వారీగా 5000 వరకు పెన్షన్ పెంపు, 400కే గ్యాస్ సిలిండ,ర్ రైతుబంధు పెంపు వంటి పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో లక్ష్మారెడ్డి మాట్లాడుతూ. .కాంగ్రెస్ పార్టీ అంటేనే కరెంటు కోతలు నీటి కష్టాలు రైతుల ఆత్మహత్యలు అభివృద్ధి నిరోధకులు అని అన్నారు. 11 సార్లు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అధికారం ఇస్తే రాజ భోగాలు అనుభవించారే తప్ప అభివృద్ధిని ప్రజా సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని అభివృద్ధి నిరోధకులుగా మిగిలిపోయారని, అలాంటి వారు అధికార దాహంతో కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను గందరగోళం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలని ఓటు వేసే ముందు నిత్యం తమ కండ్ల ముందు ఉన్న అభివృద్ధిని చూసి ఆలోచించి అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టాలని అన్నారు.

మంచి చేస్తున్న ప్రభుత్వాన్నే మళ్ళీ కొనసాగించేందుకు కారు గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య ,మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్, కౌన్సిలర్ ఉమా శంకర్ గౌడ్, కోట్ల ప్రశాంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ రేణుక, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు హాఫిజ్ ఉర్ రహమాన్, పరమటయ్య నాగులు, సిరాజ్ అలీముద్దీన్, పలువురు బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed