కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదు : మన్నె శ్రీనివాస్ రెడ్డి

by Disha Web Desk 11 |
కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదు : మన్నె శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని, వంద రోజుల్లోనే పాలన ప్లాప్ అయిందని ఎంపీ, మహబూబ్ నగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కరెంటు కోతలతో పరిశ్రమలు మూత పడే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం చెందిందన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో రాష్ట్రానికి రావాల్సిన వాటాను పోరాడి తీసుకు వచ్చానన్నారు. పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం పార్లమెంట్ లో గళమెత్తి నిధులు సాధించానని మన్నె శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపించండి. అహర్నిశలు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి, మీ శ్రేయస్సు కోసం కృషి చేస్తాను అని చెప్పారు.

కాంగ్రెస్ వి మోసపూరిత వాగ్దానాలు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని, మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సాగునీరు లేక పంటలు ఎండి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. కాంగ్రెస్ హయాంలో మహిళలు నీళ్ల కోసం బిందెలు తీసుకొని బయటికి వచ్చే దినాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. బస్సు ల్లో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించి, మహిళలు చేయి ఎత్తితే బస్సులు నిలపని పరిస్థితి ఉందన్నారు. గ్రామాలు.. పట్టణాల్లో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. అసత్య ప్రచారాలు చేసి బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటై అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి పనిచేసారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్టీ కోసం పని చేసే నాయకులు, కార్యకర్తలకు అధిష్టానం, పార్టీ అండగా ఉంటుందని, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక నేత అయిన మన్నే శ్రీనివాస్ రెడ్డి ని గెలిపిస్తే మహబూబ్ నగర్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నారు.

చెయ్యి గుర్తుకు ఓటేస్తే నెత్తిన చెయ్యి పెడతారు : మాజీ ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలు అమలు అయ్యే పరిస్థితి లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మా రెడ్డి అన్నారు. ఈ విషయం ప్రజలకు ఎప్పుడో అర్థం అయిందన్నారు. ఆరు గ్యారెంటీలపై పొంతన లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణను పదేళ్ల లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసారన్నారు. కేసీఆర్ బస్సు యాత్రతో కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో గుబులు ప్రారంభం అయిందన్నారు. ఇప్పటికే నష్టపోయాం. మళ్లీ కాంగ్రెస్ కు ఓటు వేస్తే మన నెత్తిన చేతులు పెడతారని తెలిపారు. బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని, మైనార్టీలు కాంగ్రెస్ కు ఓట్లు వేయాలని చూస్తున్నారు. మీరు చేసే పని వల్ల బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉంటాయి. మీరు ఆ రెండు పార్టీలకు కాకుండా బీఆర్ఎస్ కు ఓట్లు వేస్తే మీరు కోరుకున్న సెక్యులర్ అభ్యర్థి గెలిచినట్లు అవుతుందని లక్ష్మారెడ్డి చెప్పారు.

పదేండ్లు వెనుకబడిపోయాం : దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం 120 రోజుల్లోనే అభివృద్ధిని 10 సంవత్సరాల వెనక్కి నెట్టేసింది అని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శాసనసభ ఎన్నికలో జరిగిన పొరపాట్లను సరిచేసుకొని ఎన్నికల్లో పని చేయాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ , డిసిసిబి వైస్ చైర్మన్ కోరమోని వెంకటయ్య, జడ్పీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, బీ ఆర్ నేతలు అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, వాల్యా నాయక్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడ మాజీ చైర్మన్ గంజి వెంకన్న మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెహమాన్ , బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed