బిల్లులు మంజూరు చేయలేదని.. ఉప సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం

by Shiva |
బిల్లులు మంజూరు చేయలేదని.. ఉప సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం
X

దిశ, నవాబుపేట : పంచాయతీ రాజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్ల ప్రాణాలు మీదకు వస్తుంది. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు గాను అధికారులు బిల్లులు మంజూరు చేయడం లేదని మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండల పరిధిలోని దేపల్లి ఉప సర్పంచ్ యశోద భర్త దామోదర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణానికి అనుమతులు పొందని దామోదర్ సుమారు రూ.3 లక్షలకు పైగా వెచ్చించి పనులను పూర్తి చేశాడు. ఈ క్రమంలో చేపట్టిన పనులకు బిల్లులు మంజూరు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ ఏఈ రాములుకు శనివారం సాయంత్రం ఫోన్ చేసి వేడుకున్నాడు.

అయితే, పనుల నిర్వహణకు సంబంధించి బిల్లులను మంజూరు చేయకూడదని ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి, సోదరుడు దుష్యంత్ రెడ్డి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంకటేష్ గౌడ్ తనకు తెలిపారని అందువల్లే తాము బిల్లులు మంజూరు చేయలేదని ఏఈ రాములు దామోదర్‌కు తెలిపాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన దామోదర్ తన అత్తగారి ఊరైన కొండారెడ్డిపల్లి నుంచి వస్తూ.. మార్గమధ్యలో జడ్చర్ల సమీపంలోకి రాగానే తన వెంట తెచ్చుకున్న క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దామోదర్ ఈ అఘాయిత్యానికి పాల్పడడానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story