- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రజలందరూ వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలి.. కలెక్టర్ బీఎం సంతోష్..

దిశ, గద్వాల కలెక్టరేట్ : ప్రజలందరూ వడదెబ్బకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ సూచించారు. సోమవారం ఐడీఓసీ సమావేశ హాల్‌లో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కల్పించే గోడపత్రికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరూ వడదెబ్బకు గురికాకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోజూ తగినన్ని నీళ్లు తాగడం, నేరుగా ఎండ వేడిమి తాకకుండా జాగ్రత్తలు పాటించడం ముఖ్యమని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకూడదని, ఈ సమయంలో శారీరక శ్రమ అవసరమైన పనులను నిర్వహించకూడదని తెలిపారు.
బయటకు వెళ్లే అవసరం ఉంటే తల కప్పుకునే విధంగా గుడ్డలు, టోపీలు, గుడ్డ మఫ్లర్లు వాడాలని సూచించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య వంట చేయకూడదని, ఎందుకంటే ఈ సమయంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయని తెలిపారు. లేత రంగుల నూలు దుస్తులు ధరించడం, ఆల్కహాల్, మత్తు పదార్థాలు తీసుకోవడం మానుకోవడం అవసరమని పేర్కొన్నారు. అధిక మసాలా ఉన్న ఆహారం తినకుండా, పోషకతత్వంతో కూడిన తేలికపాటి ఆహారం తీసుకోవాలన్నారు. శుభ్రమైన తాగునీటినే ఉపయోగించాలని, కూల్‌డ్రింక్స్, అధిక చక్కెర ఉన్న పానియాలు, కాఫీ, టీ వంటి పానీయాలను తగ్గించాలని సూచించారు. ఆసుపత్రుల్లో, గ్రామాల్లో ఆశా వర్కర్ల వద్ద ఓఆర్ఎస్ (ORS) అందుబాటులో ఉన్నందున, అవసరమైన వారు దీన్ని ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. తీవ్రమైన వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే, సంబంధిత వ్యక్తిని వెంటనే 108 అంబులెన్స్ సహాయంతో దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావు , ఆర్డీవో శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సిద్దప్ప, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.