కక్కలేక మింగలేక కుమిలిపోతున్న తెలంగాణ సర్పంచులు!

by Mahesh |   ( Updated:2023-03-02 02:33:07.0  )
కక్కలేక మింగలేక కుమిలిపోతున్న తెలంగాణ సర్పంచులు!
X

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించాలని కల్పించింది. ఆ బాధ్యతలను గ్రామ సర్పంచులకు అప్పగించింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో 380 వైకుంఠధామాలు నిర్మించాల్సి ఉండగా 95 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. పనులు పూర్తిచేసి రెండేళ్లు పూర్తయినా నేటికీ బిల్లులు చెల్లించకపోవడంతో సర్పంచులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా కేవలం సుమారు రూ.5 కోట్లు వరకు పెండింగ్ లో ఉన్నాయి. అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు పూర్తిచేసినా బిల్లులు చెల్లించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ సర్పంచులది కక్కలేని మింగలేని పరిస్థితి. ఇనుగుర్తి మండలం అయ్యగారి పల్లి పంచాయతీ వైకుంఠధామ ఎంబీ రికార్డులు అధికారులు పోగొట్టడంతో వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇప్పటికైనా చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయాలని ఆయా గ్రామాల సర్పంచులు వేడుకుంటున్నారు.

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : గ్రామాలే దేశ ప్రగతికి పట్టుకొమ్మలు అని ప్రత్యేకంగా చెప్పుకుంటాం. కానీ అభివృద్ధి మాటున ఆ గ్రామ సర్పంచ్ లు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. గ్రామంపై ఉన్న మక్కువతో, ప్రభుత్వ ఆదేశాలతో ఆయా గ్రామాల సర్పంచులు అప్పులు చేసి మరీ అభివృద్ధి పనులు చేశారు. కానీ చేసిన పనులకు బిల్లులు రాక తలలు పట్టుకుంటున్నారు. రాజకీయంగా సర్పంచ్ పదవితో తమ ప్రస్థానం మొదలుపెడితే అంచెలంచెలుగా ఎదుగుతామని అందరూ భావిస్తారు. కానీ ఇప్పుడు సర్పంచ్ లు అప్పుల బాధలు తట్టుకోలేక రాజకీయమే వద్దు మొర్రో అనుకునే పరిస్థితి ఏర్పడింది.

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 18 మండలాలకుగాను 380 వైకుంఠధామాలు నిర్మించాల్సి ఉండగా 95 శాతం వరకు పూర్తి అయ్యాయి. మిగిలినవి కూడా పనులు పూర్తి కావస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా కేవలం వైకుంఠధామాల పనులకు గాను సుమారు రూ.5 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. సుమారు రెండేళ్లయినా కూడా నేటికీ పూర్తి స్థాయిలో బిల్లులు రాలేదనడంలో అతియోశక్తి లేదు. వైకుంఠధామాలు పూర్తిగా నిర్మించిన గ్రామ పంచాయతీలకు సైతం సగం మాత్రమే చెల్లించారు.ఒకొక్క గ్రామపంచాయతీకి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. అధికారులు పని రికార్డు చేసిన వెంటనే క్వాలిటీ అధికారులు రిపోర్ట్ ఇచ్చిన అనంతరం పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించాల్సి ఉండగా నేటికీ రాక సర్పంచ్ లు ఇబ్బందులు పడుతున్నారు.

మేజర్ పంచాయతీలకు ఒకింత ఇబ్బందులు ఉంటే చిన్న పంచాయతీలు మాత్రం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ట్రాక్టర్ ఈఎంఐ, డీజిల్ ఖర్చులు, డ్రైవర్, మల్టీపర్పస్ వర్కర్స్ వేతనాలు, కరెంట్ బిల్లులు, పంచాయతీ మెయింటెనెన్స్ అన్ని ఖర్చులు కలిపితే ప్రభుత్వం ఇచ్చిన దాని కంటే ఎక్కువ అవుతున్నాయని సర్పంచులు వాపోతున్నారు.

రికార్డు పోగొట్టిన అధికారులు..

మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి మండలం అయ్యగారి పల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన వైకుంఠధామ ఎంబీ రికార్డును అధికారులు పోగొట్టారు. ఇంకా సుమారు రూ.4 లక్షల బిల్లు రావాల్సి ఉండగా రికార్డు లభించకపోవడంతో ఆ గ్రామ సర్పంచ్ అవాక్కువుతున్నాడు.

ఎవరికి చెప్పుకోవాలి..

అధికార పార్టీ సర్పంచ్​లు వారి బాధను ఎవరికి చెప్పుకోవాలో లోలోన మదన పడుతున్నారు. పేరుకే అధికార పార్టీ అని, తమకు ఎలాంటి ప్రయోజనం లేదని వాపోతున్నారు. పనులు చేయడం ఒక ఎత్తు అయితే, బిల్లులు రావడం మరో ఎత్తు అయిందని ఆవేదన చెందుతున్నారు. పెండింగ్ బిల్లుల కోసం అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగి చెప్పులు అరుగుతున్నాయని మండిపడుతున్నారు.

బిల్లులు విడుదల చేయాలి..

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్య పురం గ్రామంలో వైకుంఠధామం పనులు పూర్తయి రెండేళ్లు అవుతుంది. నిధులు మాత్రం కొంత మేరకు మాత్రమే విడుదల అయ్యాయి. ఇంకా నిధులు రావాల్సి ఉంది. చాలా సార్లు మండల, జిల్లా స్థాయి ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం. వారు సానుకూలంగా స్పందించారు కానీ, నిధులు మాత్రం విడుదల కాలేదు. ఇప్పటికైనా నిధులు విడుదల చేసి గ్రామాల అభివృద్ధికి సహకరించాలి.-గుగులోత్ తులసీరాం నాయక్, అయోధ్య పురం సర్పంచ్

Advertisement

Next Story