బీజేపీ ఆశలపై నీళ్లు చల్లుతున్న మాధవిలత.. ఇలాగైతే ఎంఐఎం కంచుకోట బద్దలు కొట్టేనా?

by Prasad Jukanti |
బీజేపీ ఆశలపై నీళ్లు చల్లుతున్న మాధవిలత.. ఇలాగైతే ఎంఐఎం కంచుకోట బద్దలు కొట్టేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: అబ్ కీ బార్ 400 పార్.. నినాదంతో పార్లమెంట్ ఎన్నికల్లోకి వెళ్తున్న బీజేపీ తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లను సాధించడంపై దృష్టి సారించింది. మిగతా పార్టీలకంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి గెలుపు కోసం రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసి కదన రంగంలోకి దూకింది. అయితే అధిష్టానం వైపు నుంచి దూకుడు ఉన్నా.. కొన్ని చోట్ల క్షేత్రస్థాయి పరిస్థితులు కమలం శిబిరంలో చర్చగా మారుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నది. ఈసారి హైదరాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యంగా ఆమెను బరిలోకి దింపగా మాధవీలత మాత్రం తరచూ సోషల్ మీడియా ట్రోల్స్‌కు గురికావడం పార్టీలో కలకలం రేపుతున్నది. అసలే ఆమె అభ్యర్థిత్వంపై రాజాసింగ్ సహా, ఆ సెగ్మెంట్‌లోని పార్టీ కీలక నేతలు అసంతృప్తుతో రగిలిపోతున్నారనే టాక్ వినిపిస్తున్నది. ఈ తరుణంలో మాధవీలత తీరు ఇలాగే కొనసాగితే ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టడం సాధ్యమేనా? అనే అనుమానాలు సొంత పార్టీలో వినిపిస్తున్నాయి.

ప్రత్యర్థులకు ఆయుధాలుగా ఆమె వైఖరి

కొద్ది రోజుల ముందు మాధవీలత అంటే చాలా మందికి పరిచయం లేదు. కానీ ఇటీవల సోషల్ మీడియాలో సనాతన ధర్మం, హిందూ ఆచార వ్యవహారాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు, ఇంటర్వ్యూల ద్వారా ఆమె పేరు సోషల్ మీడియాలో మార్మోగింది. ఈ క్రమంలో ఆమెకు బీజేపీ అధిష్టానం హైదరాబాద్ ఎంపీ టికెట్ కేటాయించింది. అయితే గతంలో ఆమె ఇంటర్వ్యూల్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆమెతో పాటు పార్టీని ఇరుకున పెట్టేలా మారాయనే చర్చ జరుగుతోంది. టికెట్ రాకముందు ఎలా ఉన్నా అభ్యర్థిగా ప్రకటించాకనైనా ఆమె ఆచితూచి మాట్లాడటం లేదని, దీంతో నెటిజన్ల చేతికి చిక్కి ప్రత్యర్థులకు ఆయుధాలు ఇచ్చినంత పని చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను స్వాతంత్ర్యానికి పూర్వం పుట్టాల్సిన దానినని, అప్పుడు తన పోరాట పటిమ చూసి భగత్ సింగ్ మాదిరిగా నన్ను ఉరి తీసేవారేమో అని వ్యాఖ్యానించారు. దీంతో మీకు భగత్‌సింగ్‌తో పోలికేంటి అంటూ నెటిజన్లు ఆమె వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. ఇక ఆమె విమానంలో ప్రయాణికులకు వాటర్ బాటిల్స్ దానం చేసిన వీడియోపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మాధవీలతకు చెందిన విరించి ఆస్పత్రిలో కొవిడ్ టైమ్‌లో మెడికల్ బిల్లుల రూపంలో పేదల రక్తాన్ని తాగారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక పిల్లల పెంపకం, తన వేషధారణ విషయంలో గత ఇంటర్వ్యూల్లో ఆమె చేసిన వ్యాఖ్యలు విమర్శల పాలు చేస్తున్నాయి. అయితే సోషల్ మీడియా క్రేజ్‌తో టికెట్ సంపాదించారనే విమర్శ ఉన్న మాధవీలత ఇప్పుడు అదే సోషల్ మీడియాకు వరుసగా చిక్కుతూ ట్రోల్స్‌కు గురవుతున్నారు.

కీలక నేతల అలక

మాధవీలతకు టికెట్ కేటాయించడంతో హైదరాబాద్ లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని పలువురు కీలక నేతలు అలకబూనినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సెగ్మెంట్‌లో ఉన్న ఏకైక బీజేపీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత రాజాసింగ్ ఆమె విషయంలో నిప్పు-ఉప్పులా మారారనే టాక్ వినిపిస్తోంది. ఆమె ఎవరో తనకు తెలియదంటూ సన్నిహితుల వద్ద తెగేసి చెప్పేస్తున్నారట. టికెట్ కోసం మాధవీలత లక్షలు పోసి సోషల్ మీడియాలో పీఆర్ స్టంట్ వేశారని, దీంతో నిఖార్సైన బీజేపీ నేతలకు అన్యాయం జరిగిందని పార్టీలోని సీనియర్లు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా ఆమె పార్టీలోని సీనియర్లను కలుపుకొనిపోవడంపై దృష్టి సారించడం లేదనే విమర్శలు సెగ్మెంట్‌లో జోరుగా వినిపిస్తున్నాయి



Next Story