Local Elections: ‘సర్పంచ్‌’కు ముందే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు..!

by Shiva |
Local Elections: ‘సర్పంచ్‌’కు ముందే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల కంటే ముందే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి ప్రభుత్వం ప్రాథమిక కసరత్తును సైతం పూర్తి చేసినట్లు తెలిసింది. అన్ని రకాల లెక్కలు వేసుకున్నాకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. గతంలో సర్పంచ్​ఎన్నికల కంటే ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు పార్టీల గుర్తుల ఆధారంగా ఎన్నికలు జరుగుతాయి. పార్టీ గుర్తుల మీద జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటివరకు అధికార పార్టీకే అత్యధిక స్థానాలు దక్కినట్లు గత చరిత్ర స్పష్టంచేస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను సర్పంచ్ ఎలక్షన్స్ కన్నా ముందే నిర్వహిస్తే ప్రభుత్వానికి సానుకూల ఫలితాలతో పాటు రాష్ట్రవ్యా్ప్తంగా అనువైన రాజకీయ వాతావరణం ఏర్పడుతుందని అధికార పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

తిరుగుబాటు చేసేందుకు ధైర్యం చేయరనే భావన..

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి పోటీ చేయడానికి అనేక మంది పోటీ పడుతుంటారు. చివరికి బీ ఫాం దక్కిన వారికి విజయమో, పరాజయమో దక్కుతుంది. మిగతా వారికి రకరకాల పదవులు, ఇతరత్రా హామీలు ఇచ్చి బుజ్జిగిస్తుంటారు. అధికార పార్టీ సింబల్​బరిలో నిలిచినప్పుడు అభ్యర్థులు ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సాహసించరు. ఎందుకంట మరో నాలుగేళ్లు పార్టీ అధికారంలో ఉంటుంది. అందుకే పార్టీపై నేరుగా తిరుగుబాటు చేసేందుకు నాయకులు ధైర్యం చేయరు. దీనిని గమనంలోకి తీసుకున్న అధికారపార్టీ.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మొదట నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.

సర్పంచ్ ఎన్నికలతో కాస్త తలనొప్పి

ఎంపీటీసీ, జెడ్పీటీసీ కన్నా ముందే సర్పంచ్ ఎన్నికలను నిర్వహించాలనే నిబంధన ఎక్కడా లేదని, గతంలో మాత్రం ఆనవాయితీగా సర్పంచ్​ఎన్నికలను ముందు నిర్వహించి ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే వారని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికల వైపు ప్రభుత్వం మొగ్గు చూపినట్టు తెలిసింది. కాగా, గతంలోనూ ఓసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముందుగానే నిర్వహించారని అధికారులు చెబుతున్నారు. అయితే, సర్పంచ్​ఎన్నికలు మాత్రం పార్టీలకు అతీతంగా జరుగుతాయి. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలకు కొంత తలనొప్పిగా మారతాయి. పార్టీ బలపర్చిన అభ్యర్థిగా ఒకరు పోటీలో నిలిస్తే మరో ఒకరిద్దరు స్వతంత్రంగా పోటీ చేస్తారు. పార్టీ గుర్తులు ఉండవు. అందుకే ప్రజల్లో గుర్తింపు ఉన్న కులాలు, ఆర్థిక పరంగా స్ట్రాంగ్‌గా ఉన్న వారు పోటీలో ఉంటారు. అటువంటి వారిని అధికార పార్టీలు ముందుగా గుర్తించి బుజ్జగించి మరీ తమ దారికి తెచ్చుకుంటాయి.

కొన్నిచోట్ల పార్టీ గుర్తుపై నిలబడిన వ్యక్తులు కాకుండా స్వతంత్రులు అధికంగా గెలుస్తుంటారు. దీంతో తిరిగి వారిని పార్టీలో చేర్చుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. లేకపోతే తర్వాత వచ్చే ఎన్నికల్లో పార్టీ గుర్తుపై నిలబడే అభ్యర్థులకు ఇండిపెండెంట్ల విజయం తలనొప్పిగా మారనుంది. ఇటువంటి ప్రభావం ఉండకూడదనే మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు ప్రతి మండలానికీ కనీసం ఐదుగురు ఎంపీటీసీలు ఉండాలనే నిబంధన కోసం చట్ట సవరణకూ సిద్ధమైంది. దాని కోసం అధికారులు ఇప్పటికే బిల్లును సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. కేబినెట్ ఆమోదం పొందాక తక్కువ జనాభా ఉన్న మండలాల్లో ఎంపీటీసీ స్థానాలను విభజిస్తారు. దానికి ముందు బీసీల రిజర్వేషన్‌లకు సంబంధించి ఇంటింటి సమగ్ర సర్వే వివరాల కంప్యూటరీకరణ పూర్తి చేస్తారు. బీసీ డెడికేటెడ్​కమిషన్​నివేదిక అందిన అనంతరం స్థానిక ఎన్నికలు నిర్వహించనున్నారు.

Advertisement

Next Story