Liquor : పెరుగుతున్న మద్యం రెవెన్యూ గ్రోత్ రేట్.. రాష్ట్ర ఖజానాకు లిక్కర్ కిక్కు!

by Rajesh |
Liquor : పెరుగుతున్న మద్యం రెవెన్యూ గ్రోత్ రేట్.. రాష్ట్ర ఖజానాకు లిక్కర్ కిక్కు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ఖజానాకు లిక్కర్ ద్వారా ఆదాయం ఏటేటా పెగుతున్నది. రాష్ట్ర బడ్జెట్ సైజ్, సొంత ఆదాయమూ పెరుగుతున్నా.. కానీ వీటి వృద్ధి రేటుతో పోలిస్తే మద్యం నుంచి సమకూరే ఇన్‌కమ్ చాలా ఎక్కువ. రాష్ట్రం సొంత ఆదాయంలో దాదాపు 20% మద్యం వ్యాపారం నుంచే సమకూరుతున్నది. కరోనా సమయంలోనూ ఈ రంగం ఆదాయానికి ఢోకా లేదని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తేల్చింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వృద్ధి రేటు సగటున 15% కన్నా ఎక్కువే నమోదవుతూ ఉన్నదని పేర్కొన్నది. రాష్ట్ర స్వీయ ఆదాయం 2021-22 ఆర్థిక సంవత్సరంలో 61.49% చొప్పున పెరిగితే మద్యం ఆదాయం మాత్రం 85.56% వృద్ధి నమోదు చేసినట్టు నిర్ధారించింది. ఇది కేవలం ఎక్సయిజ్ పన్ను ద్వారా సమకూరే ఆదాయమే. దీనికి అదనంగా మద్యం మీద విధించే వ్యాట్‌ ద్వారా సైతం మరింత ఆదాయం అదనంగా సమకూరుతున్నది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సమర్పించిన ఆడిట్ రిపోర్టులో కాగ్‌పై విషయాలను వెల్లడించింది.

ఐదేండ్లలో డబుల్

జీఎస్టీ, వ్యాట్, మైనింగ్, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, మోటారు వాహనాల పన్ను, నాన్-టాక్స్ రెవెన్యూ... ఇలా అనేక రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నా వాటిలో సింహభాగం లిక్కర్ బిజినెస్ ద్వారానే వస్తున్నది. ఏటేటా మద్యం వ్యాపారం ద్వారా వస్తున్న ఆదాయం మొత్తం ఆర్థిక వృద్ధిరేటుతో పోలిస్తే చాలా ఎక్కువగా పెరుగుతున్నది. ఉదాహరణకు.. రాష్ట్ర ఎక్సయిజ్ ఆదాయం 2017-18లో 16.67% (అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే) వృద్ధిని నమోదు చేస్తే 2022-23 నాటికి అది 21.56 శాతానికి పెరిగింది. 2017-18లో ఎక్సయిజ్ ఆదాయం కేవలం రూ. 9,421 కోట్లుగా ఉంటే 2022-23 నాటికి రెట్టింపైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది రూ.25,617 కోట్లకు పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.

మద్యం విక్రయాలపై వ్యాట్ రూపంలో సమకూరేది దీనికి అదనం. గత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాల (రూ. 20,298 కోట్లు)తో పోలిస్తే దాదాపు రూ.5 వేల కోట్లు ఎక్కువ. ఫారిన్ లిక్కర్స్, స్పిరిట్స్, బీర్ల విక్రయాలు పెరుగుతున్నందున స్టేట్ ఎక్సయిజ్ డ్యూటీ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తున్నదని కాగ్ ఆ నివేదికలో పేర్కొన్నది. ఈ రూపంలో 2021-22లో మొత్తం స్టేట్ ఎక్సయిజ్ ఆదాయం రూ.17,482 కోట్లు కాగా.. ఈ రూపంలో రూ.1,864 కోట్లు అదనంగా వచ్చిందని వివరించింది. ఇక మాల్ట్ లిక్కర్ రూపంలో మరో రూ.492 కోట్లు సమకూరిందని నివేదించింది. మైనింగ్, స్టాంప్స్-రిజిస్ట్రేషన్స్, జీఎస్టీ, మోటార్ వెహికల్ టాక్స్.. ఇలాంటి రూపాల్లోని పన్నుతో పోలిస్తే స్టేట్ ఎక్సయిజ్ ప్లస్ వ్యాట్ రూపంలో మద్యం వ్యాపారం ద్వారా సమకూరుతున్నదనే ఎక్కువగా ఉంటున్నది. కొత్తగా మద్యం దుకాణాల లైసెన్సు ఫీజు తదితరాల్లేకుండానే ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసుకోవడం గమనార్హం.

అధికారులపై సీరియస్

మద్యం దుకాణాలతో పాటు, ఎలైట్ షాప్స్, బార్లు ప్రతి ఏటా రెన్యూవల్ చేసుకోడానికి ఫీజును ఆలస్యంగా చెల్లించినా దానిమీద ఆఫీసర్లు పెనాల్టీ వేయడం లేదని కాగ్ ఆరోపించింది. ఎక్సయిజ్ పన్నును ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లించడంలో జాప్యం జరిగినా జరిమానా వసూలు చేయడంలేదని పేర్కొన్నది. హైదరాబాద్ సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో 179 మద్యం దుకాణాలు, ఎలైట్ షాప్స్, బార్ల గణాంకాలను విశ్లేషించిన కాగ్... సుమారు రూ.77 కోట్లను వసూలు చేయాల్సి ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలిపింది. చర్యలు తీసుకుంటామని, పెనాల్టీ వసూలు చేస్తామని ఎక్సయిజ్ అధికారులు వివరణ ఇచ్చినా.. ప్రభుత్వానికి మూడుసార్లు గుర్తుచేసినా.. రిప్లయ్ రాలేదని పేర్కొన్నది. రాష్ట్రంలో యావరేజ్‌గా గరిష్ట స్థాయిలో 123 రోజులు ఆలస్యంగా టాక్స్, రెన్యూవల్ ఫీజు చెల్లించినట్లు పేర్కొన్నది.

సంవత్సరం ఆదాయం (రూ.కోట్లలో) వృద్ధి రేటు (ముందు సంవత్సరంతో పోలిస్తే)

2017-18 9,421 16.67%

2018-19 10,638 16.45%

2019-20 11,992 17.74%

2020-21 14,370 21.56%

2021-22 17,482 19.15%

2022-23 18,471 21.56%

(నోట్ : వ్యాట్ ద్వారా వచ్చేది కలుపుకోకుండానే..)

Advertisement

Next Story