నారాయణ స్కూల్ భవనంలో లిబర్టీ పాఠశాల అడ్మిషన్లు

by Seetharam |   ( Updated:2023-06-14 06:35:03.0  )
నారాయణ స్కూల్ భవనంలో లిబర్టీ పాఠశాల అడ్మిషన్లు
X

దిశ, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ ప్రాంతంలో గల నారాయణ పాఠశాలలో లిబర్టీ పేరుతో ఒక రూములో కూర్చుని కరపత్రాలు పంచుతూ, అడ్మిషన్లకు పాల్పడుతున్నారని ఏ ఐ పి ఎస్ యు, ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు వరద బట్టు వేణు రాజ్ మాట్లాడుతూ..నారాయణ పాఠశాలలో లిబర్టీ పేరుతో నడుపుతున్నారని విషయం తెలుసుకొని జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. విద్యాశాఖ అధికారులు తనిఖీకి పంపడంతో అసలు విషయం బయటకొచ్చినట్లు తెలిపారు.

ఈ తనిఖీలో పాఠశాల పాఠ్యపుస్తకాలతో పాటు ఒక తాళం వేసి ఉన్న గదిలో లిబర్టీ స్కూల్ కు సంబంధించినటువంటి పూర్తి కరపత్రాలు,పుస్తకాలు ఉన్నట్లు తెలిపారు. అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఏ ఐ పి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ.. ఒకే భవనంలో రెండు పాఠశాలల అడ్మిషన్లు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఈ విషయం జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలిసినా ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఇలాంటి పనులు మళ్లీ పునరావృతం కాకుండా నారాయణ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసనలో ఏ ఐ పి ఎస్ యు జిల్లా కార్యదర్శి జ్వాలా, విద్యార్థి సంఘ నాయకులు.. తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed