టెక్నాలజీతో సాగులో మార్పులను స్వాగతిద్దాం: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

by Shiva |
టెక్నాలజీతో సాగులో మార్పులను స్వాగతిద్దాం: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం వ్యవసాయంలో సాగు విధానంలో అనుసరిస్తున్న విధానాలకు భిన్నంగా, టెక్నాలజీని ఉపయోగించుకుని సాగులో జరిగే మార్పులను స్వాగతించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.. బుధవారం క్లైమేట్ సెన్స్ యూఎస్ కంపెనీ ప్రత్యేక ప్రతినిధులు మంత్రితో భేటీ అయ్యారు. ఈ భేటీలో క్లైమేట్ సెన్స్ కంపెనీ పరిశోధనల యొక్క సమగ్ర వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో మంత్రికి వివరించారు. పునరుత్పత్తి వ్యవసాయం, వివిధ రకాల స్థిరమైన వ్యవసాయ పద్ధతుల గూర్చి చర్చించారు.

ఈ విధానంలో వ్యవసాయ వ్యర్థాలను వీలైనంత ఎక్కువ రీసైక్లింగ్ చేయడం, పొలం వెలుపల ఉన్న మూలాల నుండి కంపోస్ట్ చేసిన పదార్థాన్ని జోడించడం వంటి పద్ధతుల వల్ల రైతులకు మరింత ప్రయోజనం ఉంటుందని తెలిపారు. వ్యవసాయ రంగంలో ప్రతి పంటకు చిన్న చిన్న వ్యాధులకు పురుగుల మందుల వాడకం వీపరీతంగా మారిందని, దీంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు పలు రకాల జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు.

పురుగుల మందుల వాడకం తగ్గించేందుకు మరిన్ని పరిశోధనలు అవసరమని ఆ దిశగా దృష్టి సారించాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. పురుగు మందులు విషపూరిత సమ్మేళనాలు, అవి హానికరమైన కీటకాలతో పాటు ఇతర జీవులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని అన్నారు. పర్యావరణంలో కొన్ని క్రిమి సంహారకాలు పేరుకుపోవడం నిజానికి వన్య ప్రాణులకు మరియు మానవులకు తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని తెలిపారు. కంపెనీ చేసే పరిశోధనల ద్వారా రైతులకు ఎలాంటి లాభాలు చేకూరుతాయో అడిగి తెలుసుకున్నారు. వరి పంటలో విడుదల అయ్యే కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఎలాంటి విధానాలు పాటిస్తారు.

వాటి ద్వారా రైతులకు ఎంత ఆదాయం సమకూరుతుందన్న అంశాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. కంపెనీ వారు ఏర్పాటు చేసే సెన్సార్ల ద్వారా ఎలాంటి ఉపయోగం ఉంటుందని అడిగారు. అంతే కాకుండా వరి పంటలో వెలువడే గ్రీన్ హౌస్ వాయువులను ఎలా కంట్రోల్ చేయాలో తద్వారా రైతులకు లాభదాయకం గూర్చి ఆరా తీశారు. రైతుల కొరకు క్లైమేట్ సెన్స్ కంపెనీ చేసే పరిశోధనలను మంత్రి అభినందించారు. రైతు పండించే ఉత్పత్తులను మరింత పెంచి, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎలాంటి పరిశోధనలకైనా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని యూఎస్ కంపెనీ ప్రతినిధులకు మంత్రి తుమ్మల భరోసానిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed