ధరణి సమస్యలకు పరిష్కారం చూపించిన "లీఫ్స్" సంస్థ

by M.Rajitha |
ధరణి సమస్యలకు పరిష్కారం చూపించిన లీఫ్స్ సంస్థ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి సమస్యల గుర్తింపు, పరిష్కారానికి లీఫ్స్ సంస్థ ఆరు నెలలు శ్రమించి ప్రభుత్వానికి పరిష్కార మార్గాలు చూపించింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని పది గ్రామాల్లో అధ్యయనం చేసింది ఈ సంస్థ. పది మంది న్యాయవాదులు, పారా లీగల్ వర్కర్క్స్ ఆయా గ్రామాల్లోనే బస చేసి రైతుల నుంచి అప్లికేషన్లు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటన్నింటినీ ఒక దగ్గరికి చేర్చి ధరణి పోర్టల్ సృష్టించిన సమస్యలపై సమగ్ర నివేదికను రూపొందించారు.

ఇందులో భాగంగా మొదటి దశలో ప్రతి గ్రామంలో భూ న్యాయ శిబిరం నిర్వహించి భూమి సమస్యలను గుర్తించారు. రెండో దశలో సమస్యలు ఉన్న వ్యక్తి దగ్గర ఉన్న పత్రాలు, రెవెన్యూ రికార్డులు పరిశీలించి నివేదిక రూపొందించినట్లు లీఫ్స్ సంస్థ అధ్యక్షుడు, భూ చట్టాల నిపుణులు భూమి సునీల్ బుధవారం ‘దిశ’కు వివరించారు. పది గ్రామాల్లోనే 2,114 మంది భూ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒకరు ఒకటి కంటే ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలా వారిలో 4,465 సర్వే సబ్ డివిజన్లకు సంబంధించి భూమి సమస్యలు గుర్తించినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో ఈ పైలెట్ మూడో దశలో భాగంగా సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ శాఖ సహకారాన్ని తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ సమస్యల పూర్తి వివరాలతో కూడిన నివేదికను బుధవారం యాచారం గ్రామ పంచాయితీ కార్యాలయంలో వ్యవసాయ కమిషన్ చైర్మెన్ ఎం.కోదండరెడ్డి సమక్షంలో లీఫ్స్ సంస్థ అధ్యక్షులు భూమి సునీల్ రెవెన్యూ డివిజనల్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో లీఫ్స్ ఉపాధ్యక్షులు జీవన్, లీఫ్స్ న్యాయవాదులు మల్లేష్, అభిలాష్, సందీప్, రవి, యాచారం తహశీల్దార్, లీఫ్స్ సలహాదారు కరుణాకర్ రెడ్డి, మండల రైతులు, రైతు నాయకులు పాల్గొన్నారు.

లీఫ్ సంస్థ ప్రభుత్వానికి చేస్తున్న సిఫారసులు..

* రైతులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోలేరు. మాన్యవల్ గా ఇచ్చినా స్వీకరించాలి.

* ప్రతి తహశీల్దార్ కార్యాలయంలో కనీసం నలుగురితో కూడిన సపోర్టింగ్ టీమ్ ఏర్పాటు చేయాలి.

* ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు పెట్టి దరఖాస్తులు స్వీకరించాలి. సింపుల్ ఫార్మెట్ ద్వారా రైతు సమస్యను అడగాలి.

* దరఖాస్తులకు అవసరమైన డాక్యుమెంట్లు అడిగి తీసుకోవాలి.

* వాటన్నింటిపైనా స్పీకింగ్ ఆర్డర్ రాయాలి. సమస్యలను పరిష్కరించాలి.

* తిరస్కరించే వాటికి కారణాలు తెలపాలి.

Advertisement

Next Story