దసరాకే రైతు భరోసా..నూతన మార్గదర్శకాలపై డైలమా

by Y. Venkata Narasimha Reddy |
దసరాకే రైతు భరోసా..నూతన మార్గదర్శకాలపై డైలమా
X

దిశ, వెబ్ డెస్క్ : రైతులకు పెట్టుబడి ఆర్థిక సాయంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా నిధులు దసరా కానుకగా అందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్టోబర్ 12న దసరా పండగ ఉన్న నేపథ్యంలో.. అదే రోజున నిధులను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. వాస్తవానికి ఈ రైతు భరోసా పెట్టుబడి సాయం డబ్బులు అన్నదాతలకు జులైలోనే అందాల్సి ఉంది. అయితే ప్రభుత్వం 2లక్షల రైతు రుణమాఫీ అమలుకు ప్రాధాన్యతనిచ్చిన నేపథ్యంలో నిధుల కొరతతో రైతు భరోసాను వాయిదా వేసింది. అదిగాక గత ప్రభుత్వ హాయంలో రైతుబంధు నిధులు అనర్హుల పాలయ్యాయని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను రూపొందించాలని నిర్ణయించుకుంది. దీనిపై ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ జిల్లాల్లో పర్యటించి అభిప్రాయ సేకరణ సైతం పూర్తి చేసింది. మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలు ఈ కమిటీ మెంబర్లుగా ఉన్నారు. రైతుల నుంచి సేకరించిన అభిప్రాయాలతో కూడిన నివేదికపై అసెంబ్లీలో చర్చించి నూతన విధివిధానాలు రూపొందిస్తామని భట్టి ప్రకటించారు. ఎన్ని ఎకరాల పరిమితితో రైతు భరోసా సాయం అందించాలి..కౌలు, పోడు రైతులకు ఎలా అందించాలన్నదానిపై ప్రభుత్వం ఇంకా కసరత్తులోనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ దఫా రైతు భరోసాను నూతన మార్గదర్శకాలతో అందిస్తారా..మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా రూ.15 వేలుగా అందిస్తారా అన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత కొరవడింది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అన్నదాతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రైతు భరోసా అమలుపై నేడు కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Advertisement

Next Story

Most Viewed

    null