- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పట్టు కోసం నేతల వ్యూహాలు.. పరస్పర ఆరోపణలతో హీటెక్కుతున్న పాలిటిక్స్
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఉమ్మడి జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు తమ దృష్టిని మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం వైపు సారిస్తున్నారు... పట్టు నిలుపుకునేందుకు అధికారం బీఆర్ఎస్ పార్టీ ... పట్టు సాధించేందుకు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల నేతలు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు.. ఈ నేపథ్యంలో నేతల మధ్య సాగుతున్న మాటల యుద్ధం ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
జిల్లా కేంద్రంగా ఉన్న మహబూబ్ నగర్ నియోజకవర్గంపై పట్టు సాధిస్తే మిగతా నియోజకవర్గాలలో సులభంగా విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయన్న భావనతో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఈ నియోజకవర్గంలో దృష్టి సారించి వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎత్తులు... పైఎత్తులు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. దీంతో ఇటీవల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చలకు తెర లేపాయి. -దిశ బ్యూరో, మహబూబ్ నగర్
పట్టు నిలుపుకునేందుకు మంత్రి యత్నాలు..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికలలో 2500 పై చిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, 2018 లో జరిగిన ఎన్నికలలో రికార్డు స్థాయిలో 56 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తన వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తనపై, తన సోదరుడు శ్రీకాంత్ గౌడ్ పై వ్యక్తిగత విమర్శలు చేసిన రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకు పడడంతో పాటు.. బిడ్డ నాలుక కోసేస్తాను అంటూ చేసిన కామెంట్స్.. రాజకీయ దుమారాన్ని రేపాయి.. పాలమూరు అభివృద్ధి చెందుతుంటే వాళ్ల కండ్లు మండుతున్నాయి. పాలమూరు ప్రజలను కష్టాలలో ఆదుకుంటూ... కడుపులో దాచుకుంటా అని వ్యాఖ్యానిస్తూ ప్రజల మద్దతును పెంచుకునే ప్రయత్నం మంత్రి చేశారు. ఇదే సందర్భంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సైతం ఇటు రేవంత్ రెడ్డిని, బండి సంజయ్ ని విమర్శించడంతోపాటు ప్రధానమంత్రిని సైతం విమర్శిస్తూ సభలో వ్యాఖ్యానాలు చేశారు. తమ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యమవుతుంది అని.. ఇతర పార్టీలతో సాధ్యం కాదన్న సంకేతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేశారు.
విమర్శలతో విరుచుకు పడిన విపక్ష నేతలు..
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై రాష్ట్ర మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలపై జిల్లా కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో ఎన్నడు లేని రీతిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్, అతని సోదరుడిపై డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర శేఖర్, ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు వసంత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రులపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఇకనుంచి ప్రతిరోజు మీరు చేస్తున్న, చేసిన ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు సాగిస్తామంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ దిష్టిబొమ్మను దహనం చేయడం రాజకీయ కాకను రేపుతోంది.
బీజేపీ నేతల వ్యూహాలు
జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉద్యోగులు, నిరుద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఉండడం... వారు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంటారనే నమ్మకంతో ఈ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. పలు సందర్భాలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వం, మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై విమర్శల వర్షం గుప్పించారు. నియోజకవర్గంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు.. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలో పాలమూరు రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలు ఉన్నాయి అని రాజకీయ నిపుణులు అంటున్నారు.