ఆయన మంత్రా? జోకరా?.. రేపటికల్లా నిరూపిస్తే రాజీనామా.. కేటీఆర్ చాలెంజ్

by Prasad Jukanti |   ( Updated:2024-05-25 07:27:55.0  )
ఆయన మంత్రా? జోకరా?.. రేపటికల్లా నిరూపిస్తే రాజీనామా.. కేటీఆర్ చాలెంజ్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో:అటెండర్ నుంచి గ్రూప్-1 ఆఫీసర్ వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానిక అభ్యర్థులకు ఇచ్చే రాష్ట్రం భారత దేశంలో తెలంగాణ తప్ప మరేదైనా ఉంటే కాంగ్రెస్, బీజేపీ నాయకులు రాష్ట్ర యువతకు చూపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సవాల్ చేశారు. గడిచిన పదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన ఇతర రాష్ట్రం ఉంటే కాంగ్రెస్, బీజేపీ నాయకులు చూపించాలని, లెక్కలతో సహా నిరూపిస్తే రేపటి వరకు తాను తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతానని ఇది కాంగ్రెస్, బీజేపీలకు ఆఫర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రపతి వరకు వెళ్లి కొత్త జోనల్ వ్యవస్థను తీసుకువచ్చి స్థానిక యువతకే దక్కేలా చేసింది ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని దేశంలో ఏ రాష్ట్రలోనూ 95 శాతం స్థానికత కోటా లేదని ఈ విషయాన్ని తెలంగాణ యువత, వారి తల్లిదండ్రులు ఆలోచన చేయాలన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి ఉత్తర్వులు యథేచ్ఛగా ఉల్లంఘించారని, నాన్ లోకల్ కోటా పేరిట తెలంగాణ యువతకు తీవ్ర అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఉమ్మడి ఏపీలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో 36,084 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తే.. అందులో తెలంగాణ యువతకు 10 వేల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయన్నారు. కానీ మా హయాంలో 2 లక్షల 32 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. అలాగే ప్రైవేటు రంగంలోనూ పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు సృష్టించామన్నారు. 24,000 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని, 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి 24 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాల అవకాశాలు ఇచ్చామన్నారు.

అదే నిజమైతే తేదీలు చెప్పండి:తాము ఇచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ నిసిగ్గుగా వారి ఖాతాలో వేసుకుంటోందని ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు తప్ప ఈ 5 నెలలుగా ఎవరికీ ఉద్యోగాలు రాలేదు. కానీ కేసీఆర్ హయాంలో ఉద్యోగాలు రాలేదని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా ఈ ఉద్యోగాలు రేవంత్ రెడ్డినే ఇస్తే ఏ తేదీన నోటిఫికేషన్ ఇచ్చారు? చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నయ వంచన చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. నిరుద్యోగులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఏనుగుల రాకేశ్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

సమర్థవంతంగా చెప్పుకోలేకపోయాం:బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఉద్యోగాల నియామకాలను తాము సమర్థవంతంగా చెప్పుకోలేకపోయామన్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక అనేక మోసాలకు పాల్పడుతున్నారని అధికారంలోకి వచ్చాక ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు నోటిఫికేషన్లే లేవన్నారు. తాము ఆనాడు 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తే అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేసి 60 పోస్టులు మాత్రమే అదనంగా పోస్టులు కలిపి నోటిఫికేషన్లు ఇచ్చారని, మేము 5089 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే ఎన్నికలకు ముందు మెగా డీఎస్సీ అని లొల్లి చేసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే 5913 పోస్టులు అదనంగా కలిపి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ హామీకి అతిగతీ లేదన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని అసెంబ్లీలో మోసం చేశారు. పరీక్షలకు ఫీజు తీసుకోమని చెప్పిన కాంగ్రెస్ వచ్చినాక మోసం చేస్తున్నారని టెట్ ఫీజు బీఆర్ఎస్ హయాంలో రూ.400 ఉంటే దాన్ని రూ.2000 చేశారని ఆరోపించారు.

రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్:రాష్ట్రంలో కొత్తగా బ్రూ (బి-భట్టి, ఆర్-రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, యూ-ఉత్తమ్) ట్యాక్స్ అనధికారికంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వీటిలో బిల్డర్లను చావకొడుతున్నారని ఆరోపించారు. పదేళ్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్ నాయకులు రక్తం మరిగిన పులుల్లా అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ లో ఎవరి దుకాణం వారిది, ఎవరెంత దండుకుంటే అంతా అన్నట్లుగా సాగుతోందని, రేపో మాపో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కొత్త దుకాణం తెరవబోతున్నారని ఆరోపించారు.

ఆయన మంత్రా? జోకరా?

27 అంతస్తుల బిల్డింగ్ లలో ఆసుపత్రులు నిర్మిస్తే కరెంట్ పోతే ఎలా అంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆయన మంత్రా లేక జోకరా అని సెటైర్ వేశారు. ఓ మంత్రి నోట కరెంట్ పోతదనే మాట ఎందుకు వస్తుంది. ఇలాంటి సన్నాసులు ప్రభుత్వాన్ని నడిపిస్తే అలాంటి ఆలోచనలు వస్తాయి. కరెంట్ పోతే జనరేటర్ ఉండదా? 20 వేల మెగావాట్లకు విద్యుత్ సామర్థ్యం పెరిగినా దాన్ని వాడుకునే సమర్థత లేని సన్నాసులు బకాయిలు అంటూ మమ్మల్ని అంటే ఎలా అని ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో కరెంట్ కోతలు ఉంటే ఇన్నాళ్లు ప్రశ్నించిన గొంతుకలు ఎటు పోయాయని నిలదీశారు.

Advertisement

Next Story

Most Viewed