KTR: మంత్రి ప్రకటనతో బండారం బట్టబయలు.. బీఆర్ఎస్ నేత సంచలన ట్వీట్

by Ramesh Goud |
KTR: మంత్రి ప్రకటనతో బండారం బట్టబయలు.. బీఆర్ఎస్ నేత సంచలన ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వ్యవసాయ మంత్రి ప్రకటనతో మరోసారి బండారం బట్టబయలైందని, అధికారికంగానే 20 లక్షల మంది ఉంటే, అనధికారికంగా ఇంకెంత మంది ఉన్నారో? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రుణమాఫీ మరో 20 లక్షల మందికి చేయాల్సి ఉందని మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. 20 లక్షల మందికి రుణమాఫీ కానే కాలేదన్న వ్యవసాయ మంత్రి ప్రకటనతో సీఎం బండారం మరోసారి బట్టబయలైందని, వందశాతం రుణమాఫీ పూర్తిచేశామని విర్రవీగిన ముఖ్యమంత్రివన్నీ డొల్లమాటలేనని ఇంకోసారి తేలిపోయిందన్నారు.

ఓవైపు డిసెంబర్ 9న ఏకకాలంలో చేస్తామని దగా చేసి, మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందిని మోసం చేశారని మండిపడ్డారు. అలాగే 2 లక్షల రుణమాఫీ పూర్తయిపోయిందన్న సన్నాసి మాటలు నయవంచన కాక మరేంటని ఆగ్రహించారు. అధికారిక లెక్కల ప్రకారమే.. 20 లక్షల అన్నదాతలకు అన్యాయం జరిగితే, అనధికారికంగా రుణమాఫీ కాని రైతులందరోనని వ్యాఖ్యానించారు. చేస్తామన్న రుణమాఫీ ఇప్పటికీ పూర్తి చేయలేదు ఇవ్వాల్సిన రైతుబంధు సీజన్ ముగిసినా ఇయ్యలేదని, రాబందుల ప్రభుత్వంలో రైతులకు ఏం లాభం లేదని, రేవంత్ చేతకానితనం.. అన్నదాతలకు కోలుకోని శాపంగా మారిందని కేటీఆర్ రాసుకొచ్చారు.

Next Story

Most Viewed