CM రేవంత్ రెడ్డి తమ్ముడిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
CM రేవంత్ రెడ్డి తమ్ముడిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలని కేసీఆర్ చెప్పారని అన్నారు. కానీ అనేక విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటుందని.. అందుకే రాష్ట్ర బాగు కోసం తాము స్పందిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త సచివాలయం కడితే గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు కొత్త సీఎం క్యాంపు ఆఫీసు, కొత్త హైకోర్టు ఎట్లా కడుతున్నారని ప్రశ్నించారు.

సీఎం మారినప్పుడల్లా కొత్త క్యాంపు ఆఫీసులు వస్తాయా? అని అడిగారు. తాము కట్టిన ప్రగతి భవన్‌ను ఇగోతో డిప్యూటీ సీఎం భట్టికి రేవంత్ రెడ్డి ఇచ్చారని సీరియస్ కామెంట్స్ చేశారు. కేబినెట్‌లో చర్చించకుండానే రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సాధించింది ఏం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలన ఢిల్లీ నుండే జరుగుతోందని అన్నారు. రైతు భరోసా స్టార్ట్ చేశామని దావోస్ పర్యటనలో రేవంత్ అబద్ధం చెప్పారని.. తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వంద రోజుల్లో హామీలను అమలు చేయాలని అన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల సత్తా ఏంటో ప్రజలు చూపిస్తారని, అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించి తప్పు చేశామని ఇప్పటికే ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. అంతేకాదు.. కాంగ్రెస్‌ ప్రజా పాలనలో ప్రజాప్రతినిధులకు అవమానం జరుగుతోందని అన్నారు. ఎన్నికలు నిర్వహించకపోతే సర్పంచుల పదవీ కాలం పొడిగించండని తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారని చెప్పారు. అసెంబ్లీలో జరిగిన సమావేశంలోనూ ఎలాంటి హోదా లేకుండా రేవంత్ రెడ్డి తమ్ముడు పాల్గొన్నారని గుర్తుచేశారు. ఇదంతా కాంగ్రెస్ కీలక నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

Advertisement

Next Story