KTR: ఆ ఎఫ్ఐఆర్‌ను కొట్టేయండి..

by Gantepaka Srikanth |
KTR: ఆ ఎఫ్ఐఆర్‌ను కొట్టేయండి..
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని కోరుతూ కేటీఆర్ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. మేడిగడ్డ బ్యారేజ్ విజిట్ సందర్భంగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోకుండా డ్రోన్ వినియోగించారనే ఫిర్యాదుతో పోలీసులు కేటీఆర్‌తో పాటు మరో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఈ ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో దాన్ని విచారించిన హైకోర్టు.. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. కేటీఆర్ తన పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు బెంచ్... పోలీసులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల వ్యవధిలో నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. అప్పటివరకూ విచారణ జరగకుండా వాయిదా వేసింది.

హైకోర్టు విచారణ చేపట్టి నాలుగు వారాల పాటు వాయిదా వేయడంతో ఈ లోపు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. భారత్ నాగరిక్ సంహిత్‌లని 223 (బి, 3(5) సెక్షన్ల కింద గత నెల 28న మహదేవ్‌పూర్ పోలీసులు కేటీఆర్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంబట్‌పల్లిలోని అసిస్టెంట్ ఇంజినీర్ (కాళేశ్వరం ప్రాజెక్టు) షేక్ వలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. అనుమతి లేకుండా డ్రోన్‌తో వీడియో చిత్రీకరణ జరిగిందని, బ్యారేజీకి ముప్పు పొంచి ఉన్నదని ఆ ఫిర్యాదుల పేర్కొన్నారు. దర్యాప్తుతో అరెస్టు లాంటి అవకాశం ఉందన్న భయంతోనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed