ఈ గెలుపు ఆరంభమే.. BRS మరింత నష్టపోవడం ఖాయం: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by Satheesh |
ఈ గెలుపు ఆరంభమే.. BRS మరింత నష్టపోవడం ఖాయం: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యావంతుల్లో తండ్రి కొడుకుల పాలనపై వ్యతిరేకత ఉందని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ బలపరిచిన ఏవీఎన్ రెడ్డి విజయంపై ఆయన స్పందించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అందువల్ల రాష్ట్రాంలోని విద్యావంతుల్లో కేసీఆర్, కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని ఈ ఫలితం చూస్తే అర్థం అవుతోందన్నారు. ఉపాధ్యాయులను మోసం చేసిన అధికార పార్టీ కనీసం అభ్యర్థిని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి తొలి రౌండ్ నుంచి ఆధిక్యత కనబరిచారని ఈ విజయం ఆరంభం మాత్రమేనని, ఉపాధ్యాయులను మోసం చేసిన బీఆర్ఎస్ మరింత నష్టపోవడం ఖాయం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న దృష్టి విద్యారంగ సమస్యలపై లేదని ఆరోపించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం అయిందని, పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్ట్ షాపుల పెరుగుదల పురోగతి కాదు మంచి విద్యను అందిస్తే పురోగతి అంటారని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story