MP ఎన్నికల తర్వాత CM రేవంత్ పీఠం కదలడం ఖాయం: కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

by Disha Web Desk 19 |
MP ఎన్నికల తర్వాత CM రేవంత్ పీఠం కదలడం ఖాయం: కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేసి భారత్‌ను రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలని.. ఆర్ఎస్ఎస్ భావజాలంతో 2025 కల్లా భారత్‌ను పూర్తి హిందూ దేశంగా మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి కమలం పార్టీ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో లేని అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం సిగ్గుమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు బీసీ రిజర్వేషన్‌కు ఎసరు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీ వ్యతిరేక పార్టీలని ఆరోపించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడని సీరియస్ అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రచారాన్ని ఎవరూ నమ్మరని అన్నారు. ప్రధాని మోడీ బీసీ నాయకుడని.. బీసీని ప్రధానిగా చేసిన ఘనత బీజేపీ పార్టీదన్నారు. రేవంత్ రెడ్డి ఎంత దుష్ప్రచారం చేసిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు ఖాయమని.. మోడీ మూడో సారి భారత ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. బీజేపీని చూసి కాంగ్రెస్ కాళ్ల కింద కుర్చీ కదులుతోందని ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతే సీఎం కుర్చీకి ఎసరు వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి పీఠం కదలడం ఖాయమని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.



Next Story

Most Viewed