రేపే లాస్ట్.. అగ్రనేతల రాకతో వేడెక్కిన కరీంనగర్ పాలిటిక్స్..!

by Disha Web Desk 19 |
రేపే లాస్ట్.. అగ్రనేతల రాకతో వేడెక్కిన కరీంనగర్ పాలిటిక్స్..!
X

దిశ, బ్యూరో కరీంనగర్: లోక్ సభ ఎన్నికల ప్రచార గడువు రేపటితో ముగియనుంది. శనివారం సాయంత్రం ఐదు గంటలతో ముగియనుండటంతో ఇక ప్రచారానికి ఒకరోజు మిగిలి ఉంది. దీంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ దూకుడును పెంచాయి. అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీల అగ్రనేతలను రంగంలోకి దింపుతు ప్రచారాన్ని సాగిస్తున్నాయి. సామాజికవర్గాల వారీగా ఓట్లు రాబట్టుకునేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఆయా కుల సంఘాలకు ప్రాతినిథ్యం వహించే నాయకులను గుర్తించి వారితో ఆయా పార్టీల ముఖ్య నేతలు మంతనాలు సాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలనే లక్ష్యంతో ప్రచారం చివరి అంకంపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాయి.

పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని పల్లెలు, పట్టణాలు అభ్యర్థుల ప్రచారాలతో హోరెత్తిపోతున్నాయి. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ , బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు బరిలో నిలిచారు. మూడు ప్రధాన పార్టీలు ఇక్కడ విజయం నమోదు చేయడం కోసం సర్వశక్తులు ఒడ్డుతూ ఓటర్లను ఆకట్టుకోవడానికి నానా పాట్లు పడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయా ప్రాంతాల్లో దక్కిన ఓట్లను పరిగణనలోకి తీసుకొని లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రత్యేక వ్యూహాలు రచిస్తూ రంగంలోకి దిగాయి. ఓటర్లను ప్రభావితం చేసే సామాజికవర్గాల ప్రముఖులను పార్టీలో చేర్పించడమో, మద్దతు కూడగట్టుకోవడమో చేసుకుంటూ ప్రత్యర్థులపై తమ ఆధిక్యతను చాటుకోవాలని అభ్యర్థులు తమ ప్రయత్నాలకు ముమ్మరం చేస్తు వ్యూహాలకు పదునుపెడుతున్నారు.

ఎవరి ప్రయత్నాల్లో వారు..

ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు తీవ్రంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మూడు పార్టీల అగ్రనేతలు కరీంనగర్ లోక్ సభ పరిధిలో ప్రచారం నిర్వహించి వెళ్ళగా చివరి రోజు కూడా వీలైన మేరకు ముఖ్య నేతలను రప్పించి ఓటర్ల మద్దతును కూడగట్టుకోవాలని పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే విజయంపై గట్టి ధీమాను ప్రదర్శిస్తున్నారు. సిట్టింగ్ స్థానం నిలుపుకుంటామని బీజేపీ ప్రయత్నిస్తుండగా.. ఉద్యమ పార్టీకి ఆది నుంచి అండగా ఉన్న కరీంనగర్ జిల్లాలో మరోమారు విజయకేతనం ఎగురవేస్తామని బీఆర్ఎస్, అధికార పార్టీగా ఈ స్థానాన్ని కూడా తామే దక్కించుకుంటామని కాంగ్రెస్ పార్టీ అంచనాల్లో మునిగి తేలుతున్నాయి. అయితే ఓటరు మాత్రం ఏ పార్టీ వైపు తన మద్దతు అన్నది తేల్చకపోవడంతో మూడు పార్టీల నేతలు పైకి గంభీరంగా కనిపిస్తున్నా వారి మదిలో అంతుచిక్కని సందేహాలతో సతమతమవుతున్నా గెలుపు పై మాత్రం ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed