అక్కడ ధరణి.. ఇక్కడ భూ చట్టం!... బీఆర్ఎస్ బాటలోనే వైసీపీ

by srinivas |   ( Updated:2024-05-10 02:15:01.0  )
అక్కడ ధరణి.. ఇక్కడ భూ చట్టం!... బీఆర్ఎస్ బాటలోనే వైసీపీ
X
  • రెండు నుంచి మూడు శాతం మేర ఓట్ల ప్రభావం
  • ఇక్కడ దానికి తోడు కొత్తగా ఫొటోల పిచ్చి

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: తెలంగాణలో భూములకు సంబంధించిన ధరణి పోర్టల్ చేసిన పనే ఆంధ్రాలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేయబోతుందా?. అక్కడ ధరణి మాదిరిగానే ఇక్కడా అధికార పక్షం ఈ చట్టానికి బలికాబోతుందా? అంటే అవునన్న సమాధానాలే వస్తున్నాయి. చివరకు అధికార పార్టీ నేతలు, అభ్యర్థులు కూడా ఎన్నికల సమయంలో ఈ చట్టం చర్చనీయాంశం కాకుండా ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


ధరణిపై అపోహే ముంచిందా?

తెలంగాణలో బీ‌ఆర్‌ఎస్ ఓటమికి ఒక ప్రధాన కారణం ధరణి పోర్టల్ మీద ఉన్న అపోహ అని ఆ పార్టీ నేతలే ఇప్పుడు అంగీకరిస్తున్నారు. ఆన్‌లైన్ పేరుతో అసైన్డ్ భూములు, వివాదాల్లో ఉన్న భూములు, భూ తగాదాలు ఉన్న భూములు తెలుసుకుని ఆ పార్టీ నాయకులు, అధికారులు పెద్ద ఎత్తున దోచుకున్నారు. చివరకు పేరులో ఉన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ చూపి కూడా దోచుకున్న సందర్భాలు బహిర్గతమయ్యాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి‌గా పని చేసిన సోమేష్ కుమార్ కొనుగోలు చేసిన భూములు సైతం అనుమానాస్పదంగా ఉండడంతో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.


ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో చాలా చోట్ల భూములను దోచుకుని లబ్ధిదారుల పేర్ల స్థానంలో తమవాళ్ళ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకుని ప్రజలకు టోపీ పెట్టారు. అక్కడ ధరణి చేసిన పనే ఇక్కడ ఆన్‌లైన్ సర్వే చేసింది. పలు చోట్ల తాత తండ్రుల నుంచి తమ కుటుంబానికి చెందిన భూములు వైసీపీ నేతల పేరిట ఆన్‌లైన్‌కు ఎక్కాయంటూ బాధితులు కలెక్టరేట్ల వద్ద విషం బాటిళ్లతో నిరసనలకు దిగారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయినా, ప్రభుత్వం స్పందించకుండా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకుండా మొండిగా వ్యవహరించింది. తెలంగాణలో మాదిరిగానే పల్లెల్లో ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూములు, ఎండోమెంట్ భూములకు వైసీపీ నేతల పేర్లతో పట్టాలు వచ్చేశాయి. ఇప్పుడు ప్రైవేటు భూములపై స్థానిక కోర్టుకు వెళ్లే అవకాశం లేదనడం, భూ హక్కు పత్రాలపై జగన్ ఫొటో ముద్రించడం అసలుకే ఎసరు తెచ్చింది.

రెండు నుంచి మూడు శాతం ఓట్లు పోయినట్లేనా?

పల్లెల్లో ఈ అంశం మీద నెలకొన్న భయాలు, అపోహలు, జరుగుతున్న చర్చలు చూస్తుంటే 2 నుంచి 3% దెబ్బ పడేట్లుందని వైసీపీ నేతలే ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు కూడా ఈ చట్టం మీద జనాలలో నెలకొన్న అపోహలు తొలగించకుండా చట్టాన్ని అమలు జరిపి తీరుతామని, ముఖ్యమంత్రి ఫొటోలు వుంటే తప్పేమిటని వాదిస్తుండడం సమస్యను కొనసాగింపజేస్తుంది. మొత్తం మీద తెలంగాణలో అప్పటి అధికార పార్టీకి ధరణి చేసిన నష్టం ఆంధ్రాలో ఇప్పుడు వైసీపీకి చేయనుందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed