‘రండి.. ఓటుకు రూ.500 ఇస్తాం’’.. వలస ఓటర్లకు ఆఫర్ల వర్షం కురిపిస్తోన్న MP క్యాండిడేట్స్..!

by Disha Web Desk 19 |
‘రండి.. ఓటుకు రూ.500 ఇస్తాం’’.. వలస ఓటర్లకు ఆఫర్ల వర్షం కురిపిస్తోన్న MP క్యాండిడేట్స్..!
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: పార్లమెంటు ఎన్నిక‌ల ప్రచారం గ‌డువు మ‌రో 48 గంట‌ల్లో ముగియ‌నున్న నేప‌థ్యంలో ప్రలోభాలు మొద‌ల‌య్యాయి. ‘మీ ఇంట్లో రెండు ఓట్లున్నాయా.. రానుపోనూ ప్రయాణ‌ ఛార్జీలిస్తాం. నాలుగైదు ఓట్లున్నాయా కారు పెడ‌తాం. రండి బాబూ.. వ‌చ్చి మా పార్టీకి ఓటేయండి’ అని హైద‌రాబాద్‌, వివిధ రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ ఓట‌ర్లకు పార్టీల నాయకుల విన‌తులు. విద్య, ఉద్యోగ‌, ఉపాధి నిమిత్తం హైద‌రాబాద్‌తోపాటు పొరుగు రాష్ట్రాల్లో ఉంటున్న వారిని ఓట్ల పండ‌గ‌కు సొంత ప్రాంతాల‌కు ర‌ప్పించేందుకు పార్టీల‌న్నీ ముమ్మర క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. హైద‌రాబాద్ న‌గ‌రం న‌లుమూల‌లా స్థిర‌ప‌డిన తెలంగాణ‌లోని వేల‌మంది ఓట‌ర్లు ఇప్పటికీ సొంతూళ్లోనే ఓటేయాల‌ని ఓటు హ‌క్కు స్వస్థలాల్లోనే ఉంచుకున్నారు.

ఇలాంటి వారిని ర‌ప్పించేందుకు అభ్యర్థులు ఆయా కుల‌పెద్దల‌ను, ఓట‌ర్ల బంధుమిత్రుల‌ను క‌లుస్తున్నారు. మ‌న‌వాళ్లంద‌రినీ ర‌ప్పించి, మ‌న పార్టీకే ఓటేయించాల‌ని అభ్యర్థిస్తున్నారు. ఈనెల 13న జ‌రిగే పోలింగ్‌కు రావాల్సిందిగా ఫోన్లు చేస్తున్నారు. రాను పోను ఖ‌ర్చుల‌తో పాటు ఒక్కో కుటుంబ స‌భ్యుడి ఓటుకు రూ.500 వ‌ర‌కు ఇస్తామ‌ని హామీ ఇస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఈ నెల 12 ఆదివారం, సోమ‌వారం ఎన్నిక‌ల సంద‌ర్భంగా సెల‌వు దినంగా ఉండ‌టంతో వృత్తిరీత్యా వివిధ ప్రాంతాల్లో సెటిలై, గ్రామంలో ఓటు క‌లిగిన వారిపై నేత‌లు దృష్టి సారించారు. పోలింగ్ శాతం త‌గ్గుతుంద‌నే అంచ‌నాలు, అభిప్రాయాలు వ్యక్తమ‌వుతున్న నేప‌థ్యంలో వ‌ల‌స ఓట‌ర్లతో ప‌క్కా ఓటింగ్ న‌మోద‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని పార్టీలు అంచ‌నా వేస్తున్నాయి.

ఓట‌రు లిస్టులో చూసి.. అడ్రస్ తెలుసుకుని..

ఓటరు లిస్టులో పేరున్న ప్రతి ఓటరు వద్దకు వెళుతున్నారు. వలస పోయిన వారి అడ్రస్‌ తెలుసుకుంటూ ఫోన్లు చేస్తున్నారు. పోలింగ్‌ కల్లా వచ్చి ఓటేస్తే రానుపోను ఖర్చులు ఇస్తామంటూ చెబుతున్నారు. వారు వచ్చేలా స్థానికంగా ఉన్న బంధువులతో మాట్లాడుతున్నారు. మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ ఆయా వార్డుల్లో ఓటు ఉండి వలస పోయిన ఓటర్లకు గాలం వేస్తున్నారు. రెండు, మూడు నెలల కింద ఇతర ప్రాంతాలు, పట్టణాలకు వలస వెళ్లిన వారి వివరాలను ఓటరు లిస్ట్‌లతో సేకరిస్తున్నారు. 13న జరిగే పోలింగ్‌ కోసం రావాలంటూ అభ్యర్థులు ఫోన్లు చేస్తున్నారు. రాను పోను ఛార్జీలు తామే భరిస్తామని హామీలు గుప్పిస్తూ ఎంతకైనా ఖర్చుకు వేనకాడేది లేంటూ ప్రచారం కొనసాగిస్తున్నారు.

వలస వెళ్లిన వారి ఓటు తీసేయకుండా జాగ్రత్త పడుతూ ఓట్లు తొలగించకుండా తానే చూసానని, తప్పకుండా తనకు ఓటు వేయాలని ఫోన్‌ చేసి అభ్యర్ధిస్తున్నారు. కుల పెద్దలతో వారికి ఫోన్లు చేయించి కుల కట్టుబాటు దాటవద్దంటూ సూచిస్తున్నారు. ఎన్నికలకు ముందు రోజు రావాలని వేడుకుంటున్నారు. దీంతో ఎలాగైనా ఓటేసి రావాలని చాలామంది రావడానికి సుముఖత చూపుతున్నారు. ఇప్పటి నుంచి బస్సు, రైలు ప్రయాణం కోసం రిజర్వేషన్‌ ఖరారు చేసుకుంటున్నారు. మరోవైపు ఒకే ప్రాంతంలో ఎక్కువమంది ఉంటే ప్రత్యేక వాహనాలు ఏర్పాట్లు చేస్తామని అభ్యర్థులు, నాయకులు కబురు పెడుతున్నారు. దీంతో చాలామంది సొంతూళ్లకు వస్తున్నట్లు గ్రామాల్లో ప్రచారం జరుగుతోంది. వలస ఓటర్లంతా గ్రామాల‌కు వెళ్లేందుకు స‌మాయ‌త్తమ‌వుతుండ‌టం గ‌మనార్హం.

గ్రామంపై ప‌ట్టుకు పార్టీల నేత‌ల ప్రయ‌త్నాలు..

గ్రామంలో సొంత ఇమేజ్‌, పార్టీకి ఆద‌ర‌ణ ఉంద‌ని, త‌గ్గలేద‌ని చాటేందుకు ఆయా గ్రామాల లీడ‌ర్లు ప్రయ‌త్నాలు సాగిస్తున్నారు. వాస్తవానికి పార్లమెంట‌రీ ఎన్నిక‌ల్లో పార్టీల నుంచి క్షేత్రస్థాయి లీడ‌ర్లకు పెద్దగా ఆర్థిక సాయం అంద‌లేద‌న్న చ‌ర్చే జ‌రుగుతోంది. గ్రామం నుంచి పార్టీకి లీడ్‌కు తీసుకువ‌చ్చి పొలిటిక‌ల్ క్రెడిట్ కొట్టేసి స‌మీప భ‌విష్యత్‌లో జ‌రిగే స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌కు త‌మ బ‌లాన్ని అంచ‌నా వేసేందుకు, అవ‌కాశాల‌ను మెరుగు ప‌ర్చుకునేందుకు లీడ‌ర్లు ముందు చూపుతో వ్యవ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed